నేడు పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

నేడు పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌ రామ్‌ కో సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికుడు మృతి నేడు ఐజీఎంసీ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో విజయవాడ విద్యార్థి హ్యాకథాన్‌లో విద్యార్థుల ప్రతిభ

కృష్ణా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

కోనేరుసెంటర్‌: కృష్ణా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని ఈ నెల ఒకటో తేదీ సోమవారం యఽథావిధిగా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరుగుతుందని, ఫిర్యాదుదారులు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం కోరుతూ అర్జీలు అందజేయవచ్చన్నారు. మీ కోసంలో అందిన ప్రతి అర్జీపై విచారణ జరిపించి చట్ట పరిధిలో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

జగ్గయ్యపేట(ధర్మవరపాడు తండా): గ్రామంలోని రామ్‌ కో సిమెంట్‌ కర్మాగారంలో కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మంచిర్యాల జిల్లాకు చెందిన దాసరి శ్యామ్‌ (37) కర్మాగారంలోని ప్యాకింగ్‌ ప్లాంట్‌ సెక్షన్లో 15 ఏళ్లుగా కాంట్రాక్ట్‌ కార్మికుడిగా చేస్తున్నాడు. ఈ క్రమంలో విధులకు హాజరై పని చేస్తుండగా ప్లాంట్‌ లోని సిమెంట్‌ బస్తాలు తయారై బెల్ట్‌ ద్వారా బయటికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా బెల్టు తెగి అతనిపై పడగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఫ్యాక్టరీలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందాడని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. పరిశ్రమల శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేస్తున్నారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లబ్బీపేట/గుణదల(విజయవాడతూర్పు): రామ్‌చరణ్‌ హీరోగా నటించిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం సోమవారం నగరంలో జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు. ఈవెంట్‌కు వివిధ కేటగిరీల్లో ఇప్పటికే పాస్‌లు మంజూరు చేశారు. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ ఏర్పాట్లను సెంట్రల్‌ ఏసీపీ దామోదరరావు సిబ్బందితో పరిశీలించారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం నిర్వహించిన కీ బోర్డు సంగీత వాయిద్య బృందంలో విజయవాడకు చెందిన చిన్నారికి స్థానం లభించింది. నగరంలోని సెయింట్‌ జాన్స్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మైఖల్‌ డేవిడ్‌ మందా ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జోరాస్ట్రియన్‌ క్లబ్‌లో గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల సమక్షంలో కీబోర్డ్‌ సంగీత వాయిద్య పోటీల్లో పాల్గొన్నాడు. 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డ్‌ వాయిద్యకారులు హాజరై ఏకంగా గంట సమయం వరకు ఆగకుండా ప్రదర్శన చేశారు. 777 మంది ఎంపిక కాగా ఈ ప్రదర్శనకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం లభించింది. ఈ సందర్భంగా హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ అధినేత అగస్టిన్‌ దండింగి చేతుల సర్టిఫికెట్‌ ప్రదానోత్సం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లో జరిగింది. మైఖల్‌ డేవిడ్‌ మందా సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్‌ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్‌లో ప్రతిభ కనబరిచి బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్‌ విశ్వవిద్యాలయంలో అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజినీర్‌ కార్యక్రమం, లీడర్‌ షిప్‌ ఫర్‌ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్‌ ఫ్రీ మంగళగిరి, సేవ్‌ టుడే, సెక్యూర్‌ టుమారో అనే ప్రాజెక్ట్‌ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. రివార్డు ఆధారిత ప్లాస్టిక్‌ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement