అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) ఉపయోగించి అదృశ్యమైన ఓ వ్యక్తి ఆచూకీని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న నల్లమిల్లి యోహాన్ (40) గత నెల 20వ తేదీ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో క్రైమ్ నంబర్ 157/2026 గా కేసు నమోదు చేసిన పోలీసులు తమ ప్రత్యేక బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆ తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. అనంతరం యోహాన్ ఫొటోను ఆర్టీజీఎస్ వ్యవస్థలో అప్‌లోడ్ చేయగా ఏలూరు జిల్లా కామవరపుకోట పరిసర ప్రాంతంలోని కెమెరాల్లో అదృశ్యమైన అతను కనిపించినట్లు అలర్ట్ అందింది. దీంతో పోలీసు బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. తప్పిపోయిన వ్యక్తిని గుర్తించి క్షేమంగా నగరానికి తీసుకువచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.


