హే భగవాన్‌! | - | Sakshi
Sakshi News home page

హే భగవాన్‌!

May 22 2026 5:34 AM | Updated on May 22 2026 5:34 AM

హే భగవాన్‌! ఉమ్మడి జిల్లాపై భానుడి నిప్పుల వర్షం జాగ్రత్తగా ఉండాలి..

నందివాడలో అత్యధికంగా 47.5 డిగ్రీలు నమోదు ఉదయం 8 నుంచే వడగాడ్పులు రాత్రి 10 గంటల వరకూ తగ్గని వేడి బయటకు రావాలంటే భయపడుతున్న జనాలు మరో వారం రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం

ఉమ్మడి జిల్లాపై భానుడి నిప్పుల వర్షం

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాడ్పులు కూడా వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మేలు.

– డాక్టర్‌ మాచర్ల సుహాసిని,

డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌ జిల్లా

లబ్బీపేట(విజయవాడతూర్పు): భానుడి భగభగలతో జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా నందివాడలో ఏకంగా 47.5డిగ్రీల ఉష్ణోగ్రత గురువారం నమోదైంది. విజయవాడలోనూ 45 డిగ్రీలు దాటింది. ఉదయం 8 గంటలకే వడగాడ్పులు ప్రారంభం కాగా, రాత్రి 10 గంటల వరకూ వేడి తగ్గని పరిస్థితి. దీంతో వృద్ధులు, చిన్నారులే కాదు, యువత కూడా రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు జనం లేక వెలవెలబోయాయి. మరోవైపు ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

జిల్లాలో గురువారం అత్యధికంగా నందివాడలో ఏకంగా 47.5, తిరువూరులో 46డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత విజయవాడ, గన్నవరంలలో 45.2 డిగ్రీలు, జగ్గయ్యపేట, నందిగామల్లో 44 డిగ్రీలు, గన్నవరంలో గుడివాడల్లో 43 డిగ్రీలు, మచిలీపట్నం, పెడనలో 42 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. కాగా వేడి తీవ్రత మరో 5 డిగ్రీల అధికంగా చూపుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుండగా, రాత్రి 10 గంటల సమయంలో కూడా బయటకు రాలేని పరిస్థితి కనిపించింది. ఈ తీవ్రత మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు..

ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వారు వడగాడ్పులకు త్వరగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల విషయంలోనూ అప్రమత్తత అవసరం అంటున్నారు. ఇంట్లో ఉన్నా హీట్‌స్ట్రోక్‌కు గురవుతారని అంటున్నారు. ఇంట్లోకి వేడిగాలులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే మేలు..

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మద్యం తాగడం, కూల్‌ డ్రింక్స్‌ సురక్షితం కాదంటున్నారు. రోడ్లపై అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, నీళ్లు, పళ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. తెల్లని, లేతవర్ణం, కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు.

విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పరిస్థితి, (ఇన్‌సెట్‌లో) వాహనదారుల పాట్లు

Advertisement
 
Advertisement
Advertisement