పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలు

May 22 2026 5:34 AM | Updated on May 22 2026 5:34 AM

పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలు

పెట్రో ధరల పెంపుతో నిత్యావసరాలపై ప్రభావం ప్రతి కుటుంబంపై వేలాది రూపాయల అదనపు భారం పడిపోతున్న జీవన ప్రమాణాలు ధరలను అదుపు చేయలేని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపాటు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మొన్న గ్యాస్‌, నిన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో మొత్తం మార్కెట్‌ ప్రభావితమవుతోంది. రవాణా వ్యవస్థ భారంగా నడుస్తోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఒక్కొక్కటిగా ఆకాశాన్నంటుతున్నాయి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ధరలను అదుపు చేయలేని ప్రభుత్వ అసమర్ద విధానాలు తమ బతుకును చిన్నాభిన్నం చేస్తోందంటూ సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలే ప్రధాన కారణం..

పెట్రో ఉత్పత్తుల ధరలతోనే మొత్తం మార్కెట్‌ అస్తవ్యస్తంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ రూ.60 పెరగగా.. యుద్ధం పేరుతో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవటంతో భారీగా బ్లాక్‌మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే కమర్షియల్‌ గ్యాస్‌ ధర డిసెంబర్‌లో రూ.1,776 ఉండగా అది దాదాపుగా రెట్టింపు అయ్యింది. దాంతో మార్కెట్‌లో ఏమి తినాలన్నా వాటి ధరలను అమాంతం పెంచేసి సామాన్యుడిపై భారీగా భారం మోపుతున్నారు. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ గ్యాస్‌ ధరలను సైతం పెంచటంతో వాటి ప్రభావం మొత్తం రవాణా వ్యవస్థపై పడింది.

ధరలు ఆకాశానికి..

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూనె ధరలు సలసల మండిపోతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా యుద్ధం, కొంత ప్రభుత్వ అసమర్దతతో కొంత ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తిని దిగజార్చాయని పలువురు చెబుతున్నారు. కందిపప్పు, మినపప్పు, మిర్చి, చింతపండు, పెసరపప్పు ఇలా ప్రతి వస్తువు కిలో రూ.10 నుంచి రూ.40 వరకూ గడిచిన నెల రోజుల్లో పెరిగిపోయాయి. నూనె ధరల గడిచిన ఆరు మాసాల్లో దాదాపుగా రూ.50కు పైగా పెరిగిందని వ్యాపారులు వివరిస్తున్నారు. ఇది ఒకవైపు అయితే చిన్న హోటల్‌ నుంచి ఒక మాదిరిగా ఉండే రెస్టారెంట్‌ వరకూ ఐటమ్‌కు రూ.10 నుంచి రూ.200 వరకూ పెంచి వాటి యజమానులు కస్టమర్‌ చేతికి బిల్లు అందిస్తున్నారు.

దిగజారిన ఆదాయం, కొనుగోలు శక్తి..

ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అసమర్ద విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం భారీగా దిగజారిందని పలు సర్వేలు వివరిస్తున్నాయి. ప్రధానంగా అన్ని రంగాలు కొనుగోళ్లు, అమ్మకాల పరిస్థితి చూస్తే దారుణంగా పడిపోయాయి. దాంతో సామాన్యులకు వచ్చే ఆదాయం సైతం ప్రభావితమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పడిపోవటంతో చిరువ్యాపారులు, ప్రైవేట్‌ రంగంలో పని చేసే చిరు ఉద్యోగులు, రోజువారీ వేతన జీవుల పరిస్థితి దయనీయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తత్ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల కొనుగోలు శక్తి బాగా ఉన్నప్పుడు మార్కెట్‌ ఉత్సాహంగా ఉంటుందని అయితే నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు విశ్లేషిస్తున్నారు.

దిగజారుతున్న జీవన ప్రమాణాలు..

పెరిగిన ధరలు జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆదాయంలో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, విద్యుత్‌ చార్జీలు, పెట్రోల్‌ భారాలు ఇలా నిర్ధిష్టంగా ఉండే ఖర్చులను తగ్గించుకునే పరిస్థితి ఉండదు. ఇక తినే తిండి, వైద్యం, ఇతర వినోదం వంటి అంశాలను అనివార్యంగా తగ్గించుకోవాల్సి వస్తోంది. తత్ఫలితంగా మానవ జీవనం ఇబ్బందుల పాలు కాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ధరల పెరుగుదలతో పాటు సరిపడనంత ఆదాయం లభించకపోతే సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement