ఇక దేవుడే దిగిరావాలేమో? | - | Sakshi
Sakshi News home page

ఇక దేవుడే దిగిరావాలేమో?

May 22 2026 5:34 AM | Updated on May 22 2026 5:34 AM

వేంకటేశ్వరుని భూమి స్వాధీనంపై అధికారుల ఉదాసీనత

కోర్టు ఆదేశాలూ బేఖాతరు కనీసం మట్టి తొలగించలేదు.. బోర్డు, ఫెన్సింగ్‌ మాటే లేదు ధార్మిక సంస్థల పేరుతో పార్లమెంట్‌ ముఖ్యనేత మరో ప్లాన్‌! రూ. 400కోట్ల విలువైన భూమిని కాపాడాలంటున్న భక్తులు

తాజాగా ధార్మిక సంస్థల పేరుతో..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకొనే విషయంలో కాలయాపన చేస్తున్నారు. గతేడాది నవంబర్‌ 2వ తేదీకే భూమికి సంబంధించి ఎగ్జిబిషన్‌ సొసైటీకి ఇచ్చిన 56 రోజుల లీజు గడువు ముగిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. విజయవాడకు కూత వేటు దూరంలో గొల్లపూడిలో ఎకరం రూ.10కోట్లకు పైన విలువ చేసే, 39.99ఎకరాలు.. అంటే రూ.400కోట్ల విలువైన భూమి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

ఏం జరిగిందంటే..

గత ఏడాది ఈ భూమిపై కన్నేసిన ఓ పార్లమెంట్‌ ముఖ్యనేత వరల్డ్‌ క్లాస్‌ గోల్ఫ్‌ ప్రాక్టీస్‌ రేంజ్‌ అండ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో 5 ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల నిర్వహణ పేరుతో 34.99 ఎకరాలను లీజు ముసుగులో మొత్తం 39.99 ఎకరాలను సొంతం చేసుకొనే దిశగా పావులు కదిపారు. ఈ విషయమై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో ఆ ప్రతిపాదనలకు బ్రేక్‌ పడింది. ఈ విషయంలో వేర్వేరుగా రెండు పిటీషన్లు హైకోర్టులో దాఖలు అయ్యాయి. అప్పటికే ఎలాంటి అనుమతి లేకుండా వరి పంట పండే పొలంలో విజయవాడ ఉత్సవాల నిర్వహణ కోసం అంటూ 4నుంచి6 అడుగుల మట్టి తోలి చదును చేశారు. ఈ విషయమై కోర్టు సీరియస్‌ అయ్యింది. వ్యవసాయ భూమిని యథా పూర్వ స్థితికి తీసుకొని రావాలని, 35 ఎకరాల్లో వేసిన గ్రావెల్‌ తొలగించాలని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టుకు వెళ్లి తాత్కాలికంగా 56 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొనేందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీ అనుమతి తెచ్చుకొంది. అక్కడ కూడా స్పష్టంగా భూమిలో వేసిన మట్టి తీసేసి, భూమి పూర్వ స్థితికి తేవాలని కోర్టు పేర్కొంది.

కోర్టు ఆదేశించినా..

దేవదాయశాఖ అధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు. ఇప్పటికీ ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. దానిలో వేసిన మట్టి తొలగింపు దిశగా చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో వేసిన మట్టిని కూడా పార్లమెంటు ముఖ్యనేత ఆధ్వర్యంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తోలారు. ఆ మట్టి ఎక్కడ నుంచి ఇక్కడికి తోలారో విజిలెన్స్‌ ద్వారా విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, మీకింత నాకింత పంచుకు తినడాన్ని అలవరుచుకొన్న నేతలు.. కోర్టు అక్షింతలు వేసినా ఎలాగైనా గొడుగు పేట వేంకటేశ్వర స్వామి భూమిని కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటు ముఖ్యనేత దేవదాయశాఖ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, భూమి కాజేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ధార్మిక సంస్థలకు భూమి కేటాయింపు పేరుతో ఫైలు సిద్ధం చేయించారు. ఆ ఫైలు సైతం దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు చేరినట్లు చర్చ సాగుతోంది. భూమిని స్వాధీనం చేసుకొని మట్టి తొలగింపు చేపట్టకుండా ఉండటం వెనుక పార్లమెంటు ముఖ్యనేత ఒత్తిడితో పాటు, కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేఫథ్యంలో దేవదాయ శాఖ అధికారులు స్పందించి, వెంటనే భూమిని స్వాధీనం చేసుకొని బోర్డు, ఫెన్సింగ్‌, ఏర్పాటు చేయడంతోపాటు మట్టి తొలగింపు చర్యలు తీసుకొని, దేవుడి భూమిని పార్లమెంటు ముఖ్య నేతతో పాటు పచ్చనేతల చెర నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement