సిటీ ఆర్మ్‌డ్‌ గ్రౌండ్స్‌లో నూతన భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సిటీ ఆర్మ్‌డ్‌ గ్రౌండ్స్‌లో నూతన భవనం ప్రారంభం

May 22 2026 5:34 AM | Updated on May 22 2026 5:34 AM

సిటీ ఆర్మ్‌డ్‌ గ్రౌండ్స్‌లో నూతన భవనం ప్రారంభం ఖేలో ఇండియా స్పోర్ట్స్‌ సెంటర్లలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం ‘వేంకటేశ్వరుని కిరీటం’ అంశంపై విచారణ వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): సిటీ ఆర్మ్‌డ్‌ గ్రౌండ్స్‌లో నిర్మించిన నూతన భవనాన్ని గురువారం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు లాంఛనంగా ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన భవనంలో సిటీ సెక్యూరిటీ వింగ్‌ బాంబ్‌ డిటెక్షన్‌ – డిస్పోజల్‌ స్క్వాడ్‌, స్టోర్‌ రూమ్‌, వర్క్‌షాప్‌, డాగ్‌ హ్యాండ్లర్స్‌ రెస్ట్‌ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నగర రక్షణ, భద్రతలలో సిటీ సెక్యూరిటీ వింగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ విభాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని సీపీ చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వీటి వల్ల సిబ్బంది పనితీరును మరింత మెరుగుపడుతుందన్నారు. డీసీపీలు కృష్ణకాంత్‌ పటేల్‌, షిరీన్‌బేగం, తిరుమలేశ్వరరెడ్డి, కేజీవీ సరిత, బి. లక్ష్మీనారాయణ, కృష్ణప్రసన్న, ఎస్‌వీడీ ప్రసాద్‌, ఏసీపీలు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌), భారత క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఖేలో ఇండి యా స్పోర్ట్స్‌ సెంటర్లలోని వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.భరణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మేనేజర్‌, ఆర్చరీ హెడ్‌ కోచ్‌, న్యూట్రీషనిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మసాజర్‌ పోస్టులు ఉన్నాయని వివరించారు. అర్హత, వేతనాల వివరాల కోసం స్పోర్ట్స్‌.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో సందర్శించాల్సిందిగా కోరారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు జూన్‌ ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా తమ బయోడేటాను కేఐఎస్‌సీఈ.ఏపీఎట్‌దిరేట్‌జీమెయిల్‌.కామ్‌కు పంపాలని, ఇతర వివరాలకు 0866–2499699 ఫోన్‌ నంబరులో సంప్రదించాల్సిందిగా కోరారు.

గుడివాడ టౌన్‌: స్థానిక వాసవీ చౌక్‌లో వేంచేసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు సమర్పించుకున్న బంగారు కిరీటం వ్యవహారంపై దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విచారణ చేపట్టారు. గురువారం దేవదాయ శాఖ సిబ్బందితో కలిసి ఆలయ పూజారిని విచారించారు. ట్రస్ట్‌బోర్డు నిర్ణయం మేరకు కిరీటాన్ని రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు సమాచారం ఉన్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ లలిత గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ట్రస్ట్‌కు చెందిన 31 మందికి ఫోన్‌ చేయగా వారు అందుబాటులో లేమని అనడం హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు. ముందుగానే వారికి సమాచారం ఇచ్చామన్నారు. ఇది ట్రస్ట్‌ బోర్డు కనుక దేవదాయ శాఖ నేరుగా వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వాలని, పూర్తి వివరాలు సేకరించే వరకూ ఆలయంలోనే ఉంటామని ఆమె తెలిపారు. అనంతరం ఆలయ అర్చకుడు, కిరీటం దాత, ముగ్గురు కమిటీ సభ్యుల వద్ద నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పలువురిని నియమించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఐటీ వింగ్‌ సెక్రటరీగా అలవాల రవీంద్రారెడ్డి (మైలవరం), రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా షేక్‌ రహంతున్నీసా, బత్తిన నాగపావని (విజయవాడ వెస్ట్‌) నియమితులయ్యారు.

● కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మైల రత్నకుమారి పార్టీ ప్రచారం విభాగం జోన్‌–3 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement