పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు? | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు?

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు? వెండి నాగపడగ బహూకరణ ఎస్‌ఆర్‌ఎంలో ఏఐ ఏకీకృత ప్రోగ్రామ్స్‌

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: హనుమాన్‌జంక్షన్‌లో కలకలం రేపిన చిన్ని ఎంటర్‌ప్రైజెస్‌, కేకే హెచ్‌–మార్ట్‌ల అధినేత వడ్డి క్రాంతి కిరణ్‌ (చిన్ని) హత్య కేసులో నిందితుడు, మాజీ రౌడీషీటర్‌ రామినేని రామకృష్ణ (ఆర్‌కే) పోలీసుల అదుపులో ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. స్థానిక విజయవాడ రోడ్డులోని కేకే హెచ్‌–మార్ట్‌ను మూసివేసి మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా వడ్డి క్రాంతి కిరణ్‌ (చిన్ని)ని వెనుక నుంచి వేగంగా కారు ఢీకొట్టి హత్య చేసిన విషయం విదితమే. పాత కక్షల నేపథ్యంలో మాజీ రౌడీ షీటర్‌ ఆర్‌కే ఉన్మాదంగా వ్యవహరించి ఈ దురాగతానికి పాల్పడటంతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ఈ తరుణంలో బుధవారం గన్నవరం సమీపంలో నిందితుడు ఆర్‌కే ఆచూకీని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన ప్రాంతాన్ని మచిలీపట్నం క్లూస్‌ టీం, హనుమాన్‌జంక్షన్‌ ఇన్‌చార్జి సీఐ శివప్రసాద్‌ పరిశీలించి ఆధారాలను సేకరించారు.

అవనిగడ్డ: చారిత్రక ప్రసిద్ధి నొందిన లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయగా అర్చకులు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా వెండి నాగపడగను ఆలయ ధర్మకర్త పోతరాజు భాస్కరరావు, వెంకట శ్రీకాంత్‌, వెంకట లక్ష్మీకిరణ్మయి బహూకరించారు. ఈఓ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఏపీ ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో సమ్మిళితమైన ఎమ్మెస్సీ (ఎకనామిక్స్‌), ఎమ్మెస్సీ (సైకాలజీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సీహెచ్‌ సతీష్‌కుమార్‌ చెప్పారు. విజయవాడలో కోర్సుల పోస్టర్‌ను ఆవిష్కరణను బుధవారం నిర్వహించారు. ఆచార్య సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ప్రాముఖ్యత కలిగిన కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీతో ఏపీ ఎస్‌ఆర్‌ఎం ఎంవోయూ చేసుకొని తమ సంస్థలోని పలువురు ప్రొఫెసర్లకు శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెస్సీ (ఎకనామిక్స్‌ )లో బలమైన ఆర్థిక సిద్ధాంతాన్ని ఏఐ ఆధారిత గ్లోబల్‌ సవాళ్లను పరిష్కరించేందుకు సహాయపడుతుందన్నారు. దేశంలో ఇలాంటి కోర్సు అరుదుగా ఉందన్నారు. ఎమ్మెస్సీ (సైకాలజీ) కోర్సునూ ప్రత్యేకంగా రూపొందించారన్నారు. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ కలిగిన విద్యార్థులకు ఒక సంవత్సరం ప్రోగ్రామ్‌గా, మూడేళ్ల కాలపరిమితి కలిగిన డిగ్రీ కలిగిన వారికి రెండు సంవత్సరాల ప్రోగ్రామ్‌గా దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. డిగ్రీలో వారు సంపాందించిన మార్కుల ఆధారంగా ఫీజు రాయితీ ఉంటుందని వివరించారు. సమావేశంలో ఈశ్వరీ స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ డీన్‌ డాక్టర్‌ విష్ణుపథ్‌, ఎకనామిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఉబైద్‌ ముస్తాక్‌, సైకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఆయేషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement