తాళం వేస్తే.. ఇల్లు ఖాళీ! | - | Sakshi
Sakshi News home page

తాళం వేస్తే.. ఇల్లు ఖాళీ!

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): పగలు రెక్కీ నిర్వహిస్తారు.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు.. రాత్రి వేళల్లో ఆ ఇంటి తాళాలు పగలకొట్టి చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించి నగదు, ఆభరణాలను దోచుకెళ్తారు. ఇలాంటి ఘటనలు ఇటీవల విజయవాడతో పాటు, జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో చోటుచేసుకున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు చోరీ చేసిన నిందితులు సైతం పోలీసులకు చిక్కారు. పిల్లలకు వేసవి సెలవుల నేపథ్యంలో శుభకార్యాలు, విహార యాత్రలకు ఎక్కువగా వెళ్తుంటారు. అలాంటి వారు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తిరిగి వచ్చే సరికి ఇంట్లో సొమ్ము, సొత్తు చోరీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇలా చోరీకి స్కెచ్‌.. మద్యం, గంజాయి, బెట్టింగ్స్‌కు అలవాటు పడిన యువత, వారు సంపాదించేవి చాలక చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న నిందుతుల్లో అలాంటి కోవకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నేరస్తులు ఇద్దరు, ముగ్గురు కలిసి నివాస ప్రాంతాల్లో పగలు తిరుగుతుంటారు. అలా తిరిగే సమయంలో తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తిస్తారు. అంతేకాదు చోరీ చేసేందుకు అనువుగా ఉందో లేదో కూడా పరిసరాలను గమనిస్తారు. అంతే రాత్రి వేళలో ఆ ఇంటి తాళం పగలకొట్టి సొమ్ము, సొత్తు చోరీ చేస్తారు. ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుంచి నేరస్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన వారే నేరస్తులుగా మారిపోవడం విస్మయానికి గుర్తిచేస్తోంది. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో విహార యాత్రలకు, శుభ కార్యాలకు కుటుంబ సమేతంగా వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలోనే నేరస్తులు సైతం ఆయా ఇళ్లపై కన్నేసి అవకాశం ఉంది. ఇంటికి తాళంవేసి వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ నంబర్లు గుర్తుంచుకోండి..

జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇంటికి తాళం వేసి వేరే ప్రదేశాలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నేరస్తులు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే చొరబడి చోరీలకు పాల్పడుతున్నందున పోలీసులు సూచనలు పాటించాలి. ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇస్తే లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఇంటి హాలులో కెమెరా)ను ఏర్పాటు చేస్తారు. దీంతో నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో నగదు, విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో పెడితే మంచిది. అపరిచిత వ్యక్తులు మీ ప్రాంతంలో సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ఇవి పాటించడం మేలు..

సెలవులకు ఊరెళ్లేవారు తస్మాత్‌ జాగ్రత్త!

పగలు రెక్కీ చేసి, రాత్రి వేళ

దొంగతనాలు చేస్తున్న నేరగాళ్లు

విలాసాలకు అలవాటుపడి

చోరీలకు పాల్పడుతున్న వైనం

పోలీసుల అదుపులో వరుస

చోరీల నిందితులు

● విజయవాడ కృష్ణలంక శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఈ నెల మొదటి వారంలో అయోధ్యకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటంతో ఉలిక్కిపడింది. బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వాంబే కాలనీకి చెందిన పాత నేరస్తుడు ములకల నిరంజన్‌ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

పోలీస్‌ కంట్రోల్‌ రూం : 112

ఏసీపీ క్రైమ్‌ : 9440627040

సీఐ క్రైమ్‌ : 8333993112

లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ కోసం

: 9440627040

– ఎం. రాజారావు, అడిషనల్‌ డీసీపీ

ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇస్తే, లాక్డ్‌ హౌస్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు.

ఇంట్లోని ఖరీదైన బంగారు నగలు, నగదును బ్యాంక్‌ లాకర్‌లో ఉంచి, అవసరమైనప్పుడు తీసుకోవాలి.

ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి పర్మినెంట్‌ అడ్రసు, వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వారి వద్దకు ఎవరైనా వస్తున్నారా, రాత్రి వేళల్లో వారి చర్యలను గమనించాలి.

ఇంటి పరిసరాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలి.

రాత్రి వేళల్లో పడుకునే ముందు ఇంటి తలుపులు, కిటికీలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఖరీదైన వస్తువులు కిటికీల వద్ద పెట్టవద్దు.

ఇంటి తలుపులు, కిటికీలకు ఎలక్ట్రికల్‌ సెక్యురిటీ అలారమ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది.

అపరిచిత వ్యక్తులు ఇంటికి రాకుండా చూడాలి. కిటికీలో నుంచి మాట్లాడి పంపించి వేయాలి.

పనిమనిషి, సెక్యూరిటీ, వాచ్‌మెన్‌ను నియమించే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

ఇంటి మెయిన్‌గేటు, ప్రధాన గుమ్మం వద్ద, హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement