పెట్రోల్, డీజిల్ కొరత చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే
విజయవాడ ధర్నా చౌక్ వద్ద మినీ వ్యాన్‌ను తాడుతో లాగుతూ నిరసన తెలుపుతున్న
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు
విజయవాడ భవానీపురంలోని ఓ బంకు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో
మాట్లాడుతున్న మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ మహానాడు రోడ్డు సిగ్నల్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట నిరసన
తెలుపుతున్న దేవినేని అవినాష్, ఆటోడ్రైవర్‌లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంధన కొరత ఏర్పడిందని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజలు నమ్మి కూటమికి ఓట్లేస్తే డీజిల్, ఎరువుల కోసం రైతులను, పెన్షన్ల కోసం వృద్ధులను, రేషన్, గ్యాస్ కోసం మహిళలను రోడ్డెక్కించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పెట్రోల్ బంక్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లతో ఆటోలను లాగుతూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో దేవినేని రాజశేఖర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అవినాష్ తాడుతో ఆటో లాగి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని, ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా అందించలేకపోతోందన్నారు. సర్కారు వైఫల్యాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ వద్ద మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద పెట్రోల్ బంక్‌ను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ 70శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తోందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయంటూ అబద్దాలు చెబుతోందన్నారు. ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ధరలు పెంచేందుకు కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు.
● తిరువూరు, జగ్గయ్యపేటలో ఆయా నియోజక వర్గాల ఇన్‌చార్జిలు నలగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ
వైఎస్సార్ సీపీ నాయకులు
అన్ని వర్గాలను రోడ్డున
పడేసిందంటూ ఆవేదన
ఇంధన కొరతపై జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన


