ఉత్సాహంగా చెస్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా చెస్‌ టోర్నీ

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

ఉత్సాహంగా చెస్‌ టోర్నీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చిన్న వయస్సులో నుంచే చెస్‌ను ఆడటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని, దాని వల్ల చదువులో కూడా రాణించవచ్చని విదిత్‌ కళాశాల డైరెక్టర్‌ వి.లోకేష్‌ చెప్పారు. స్థానిక లబ్బీపేటలోని విదిత్‌ కళాశాల ఆవరణలో ఎన్టీఆర్‌ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ అండర్‌–11 చెస్‌ టోర్నమెంట్‌ మంగళవారం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 29 మంది బాలురు, 16 మంది బాలికలు పాల్గొన్నారు. వీరికి ఐదు రౌండ్స్‌లో పోటీలను నిర్వహించారు. బాలబాలికలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని వారిలోని ప్రతిభను చూపారు. పోటీల్లో విజేతలకు జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి వి. లోకేష్‌ అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.రేణుక పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న వారికి మెడల్స్‌ను అందజేశారు. ముగిసిన కౌలురైతు సంఘ రాష్ట్ర మహాసభలు 7 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు

ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం రాష్ట్ర 4వ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ఉయ్యూరులోని వీఆర్‌కేఎం పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి హాజరై రైతులు, కౌలురైతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన అంశాలపై సూచనలు చేశారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమన్నారు. అనంతరం మహాసభ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 45మంది సభ్యులతో కూడిన కమి టీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.బలరాం, కార్యదర్శిగా మాగంటి హరిబాబు, కోశాధికారిగా వై.రాధాకృష్ణ, ఉపాధ్యక్షులుగా వి.శ్రీనివాసరావు, రాజబాబు, రామాంజనేయులు, లక్ష్మణస్వామితో కూడిన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కౌలురైతుల పోరాటాలపై పలు తీర్మానాలను ఆమోదించారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: హనుమజ్జయంతి వేడుకలు మే 7 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. హనుమాన్‌ జంక్షన్‌లోని ఆలయ ప్రాంగణంలో హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తామని, ఆలయ అధ్యాత్మిక వేదికపై భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్‌ పావులూరి రామారావు, ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, పుర ప్రముఖులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

పలు రైళ్లు రద్దు,

మరికొన్ని దారి మళ్లింపు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ట్రాక్‌ల నిర్వహణ కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి(18505) రైలును ఈ నెల 29న, తిరుపతి–విశాఖపట్నం (18506) రైలును ఈ నెల 30న తిరుచానూరు –తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 28న చర్లపల్లి–తిరుచిరాపల్లి(07615) రైలు పాకాలా, చిత్తూరుకు బదులుగా రేణి గుంట, మెల్పక్కం క్యాబిన్‌, కాట్‌పాడి మీదుగా దారి మళ్లించారు. తిరువన్నమలై–నర్సాపూర్‌ (07220) రైలు ఈ నెల 30న చిత్తూరు, పాకాలా, తిరుపతికి బదులుగా కాట్‌పాడి, మెల్పక్కం క్యాబిన్‌, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు.

మే ఒకటో తేదీన కన్యాకుమారి–ఎస్‌ఎంవీడీ కత్రా (16317) రైలును చిత్తూరు, తిరుపతికి బదులుగా కాట్‌పాడి, మెల్పక్కం క్యాబిన్‌, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం –ఓఖా తిరుపతికి బదులుగా కాట్‌పాడి, మెల్పక్కం క్యాబిన్‌, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడపనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement