నీటి భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

నీటి భద్రతకు ప్రాధాన్యం

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో నీటి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సమర్థంగా జలవనరులన్నీ నింపుకొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాలులో నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అధికారులకు జలధార– జలహారతి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మనిషి బతకాలంటే నీరు చాలా అవసరమని, వర్షం ఒకసారి కురిసినప్పుడు అది ఏదో నదిలో కాని, కాలువలో కాని కలిసి సముద్రంలోకి వెళ్లిపోతుందన్నారు. కొంత వరకు భూగర్భజలాలుగా ఉండిపోతుందన్నారు. ఇలా ప్రతిరోజు వర్షం కురవదు కాబట్టి నీటి నిల్వలను ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పథకం ద్వారా నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతి నీటి బొట్టును నిల్వ ఉంచి భూగర్భ జలాలు పెంపొందించాలని సూచించారు. ఇందుకోసం వంకలకు అడ్డుగా ఉన్న ముళ్లపొదలు, కంపచెట్లు అన్నింటిని స్థానికులతో కలిసి శ్రమదానం ద్వారా తొలగించుకోవాలన్నారు. సీఆర్డీ అదనపు కమిషనర్‌ శివప్రసాద్‌, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్‌, జలవనరులశాఖ ఎస్‌ఈ గుణకర్‌, జాయింట్‌ కమిషనర్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

Advertisement
 
Advertisement
Advertisement