మైలవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి పల్లెపల్లెకు పాకింది. మత్తుకు బానిసలైన యువత గంజాయి తాగడంతో పాటు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తు న్నాయి. పట్టణ, నగర ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం గంజాయి చేరడం నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. పోలీసులు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో సైతం పెద్ద ఎత్తున గంజాయి సేవిస్తున్న యువకులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడిన ఘటన మైలవరంలో మంగళవారం జరి గింది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బదాస్ లోహోర, గుప్తా హారిజస్ జి.కొండూరు మండల పరిధి చేగిరెడ్డిపాడు శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో కొంత కాలంగా పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఏలూరు జిల్లా, నూజివీడుకు చెందిన చింతం విజయ్ బాబు, షేక్ మెహర్ బాబా, మైలవరానికి చెందిన షేక్ ఆసిఫ్, మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన తన్నీరు గోపీకృష్ణ ఒక ముఠాగా ఏర్పడి మైలవరం, తిరువూరు, నూజివీడు, తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. బదాస్ లోహోర, గుప్తా హారిజస్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరం పాత ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్ వద్ద ముఠాలోని మిగతా నలుగురుకి అందజేస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులు దాడి చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఉన్న మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన ఆరుగురు నిందితులు గతంలో గంజాయి కేసులలో పట్టుబడిన వారేనని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏసీపీ వై.ప్రసాదరావు ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ కె.కిషోర్ బాబు, ఎస్‌ఐలు కె.సుధాకర్, గిరిసాయి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇటీవల పట్టుబడిన ఘటనలు
● ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాచవరం గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల ఓపెన్ ప్లాట్లలో ఖాళీ ప్రదేశంలో ఉన్న ముగ్గురు యువకుల నుంచి సుమారు ఆరు కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ నెల నాలుగో తేదీన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల రోడ్డులో చిన్నచిన్న గంజాయి పొట్లాలు కట్టి విక్రయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో కంచికచర్ల మండలంలోని పరిటాలలో ఆరుగురు వ్యక్తుల నుంచి మూడు కిలోల గంజా యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌పై దండయాత్రలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ముత్తవరపు కల్యాణ మండపంలో పోలీసులు 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మంది గంజాయి తాగినట్లు నిర్ధారణ అయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు.
విజయవాడలో పట్టుబడ్డ మరో ముఠా
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): మరో గంజాయి ముఠా విజయవాడ పోలీసులకు పట్టుబడింది. సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని అపార్ట్‌మెంట్ల ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకొని గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరీపేటలోని కేజీఎఫ్ అపార్ట్‌మెంట్ల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా గుమ్మడి సంజయ్, నాగభూషణం, జాన్సీ, లక్ష్మీనారాయణ, అహ్మద్ నావేల్, అన్సార్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి దొరికింది. వీరందరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల వ్యవధిలోనే సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు గంజాయి ముఠాలు పట్టుబడటం గమనార్హం. ఈ మూడు ముఠాల నుంచి మొత్తం పదిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు.
మైలవరంలో ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
నిందితుల నుంచి
మూడు కిలోల గంజాయి స్వాధీనం
వరుసగా పట్టుబడుతున్న
గంజాయి ముఠా సభ్యులు


