ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

ఉయ్యూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉయ్యూరు జియో పెట్రోల్‌ బంకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ప్రైవే టు ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు క్లీనరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. రమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు యానాం నుంచి 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్‌ బయలుదేరింది. ఉయ్యూరు జియో పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే చేపల లోడుతో ఆగి ఉన్న లారీని అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్‌ బస్సు వెనుకగా వచ్చి ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జునజ్జయింది. బస్సు క్లీనరు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సంత చెరువు మార్కెట్‌ చెందిన ఎరబాల సూర్యచంద్రశేఖర్‌ (20) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవరుతో పాటుగా బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్సుల్లో వైద్యం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. తొమ్మిది మంది ప్రయాణికులు విజయవాడలో, ఐదుగురు ప్రయాణికులు ఉయ్యూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో క్లీనరు ఎరబాల సూర్యచంద్రశేఖర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భయంతో భీతిల్లిన ప్రయాణికులు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు యానాం నుంచి బయలుదేరి సమయం నుంచి డ్రైవరు అతివేగంగానే బస్సును నడుపుతున్నట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. కొత్త హైవే మీదుగా మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లే క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక జియో పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో వచ్చిన శబ్దానికి ప్రయాణికులు భీతిల్లారు.

నిద్రలో ఉన్న ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు. నిద్ర మత్తు నుంచి తేరుకునే లోపే పలువురు ప్రయాణికులు గాయాలపాయ్యారు. ఈ ప్రమాదాన్ని పెట్రోలు బంకులో పనిచేస్తున్న సిబ్బంది ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు గుర్తించి క్షతగాత్రులను బయటకు లాగటంలో సహాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులతో99 కలిసి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

బస్సు క్లీనరు సూర్యచంద్రశేఖర్‌

మృతదేహం

ప్రమాదంలో ధ్వంసమైన

ట్రావెల్స్‌ బస్సు ముందు భాగం

క్లీనరు మృతి,

మరో 14 మందికి గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement