అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో వివిధ అభి వృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సీసీ, బీటీ రహదారుల అభివృద్ధి, డ్రెయిన్లు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం తదితర మౌలిక వసతుల కల్పన, అభి వృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్యత ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి నిధులు మంజూరు కోరతామని కలెక్టర్‌ తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల్లో చేసిన పనుల వల్ల ప్రయోజనం పొందే ప్రాంతాలు, లబ్ధి పొందే జనాభా, పనుల ప్రాముఖ్యత వంటి అంశాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ నమ్రత అగర్వాల్‌, జెడ్పీ సీఈఓ జె.అరుణ, డ్వామా పీడీ ఎన్‌.వి.శివప్రసాద్‌, మార్కెటింగ్‌ ఏడీ నిత్యానందం, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ షేక్‌ షాహిద్‌బాబు, పశుసంవర్ధక శాఖాధికారి చిననరసింహులు, మెప్మా పీడీ సాయిబాబు, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ మురళీకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి

పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో పరిశ్రమలు, ఎగుమతులు, ప్రోత్సాహక మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన అన్ని అనుమతులను సింగిల్‌ డెస్క్‌ పాలసీ ద్వారా మంజూరు చేయటమే కాకుండా ప్రభుత్వ రాయితీలు అందిస్తామన్నారు. జిల్లాలో 628 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిలో 606 దరఖాస్తులకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ఆమోదించామన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ ఆర్‌.వెంకట్రావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు, జిల్లా రిజిస్ట్రార్‌ గోపాలకృష్ణమూర్తి, భూగర్భజలశాఖ ఏడీ బిందుశ్రీ, మచిలీపట్నం మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

Advertisement
 
Advertisement
Advertisement