దుర్గగుడి ప్రాంగణంలో దారుణం | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడి ప్రాంగణంలో దారుణం

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే మహా మండపం ఆరో అంతస్తులోని మహిళల టాయిలెట్లలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. టాయిలెట్‌కు వెళ్లిన వారిని గోడ ఎక్కి చూడటంతో లోపల ఉన్న ఇద్దరు మహిళలు కేకలు వేశారు. ఆలయ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మహా మండపం నాలుగో అంతస్తులో సెక్యూరిటీ సిబ్బందితో ఆలయ ఈఓ, వన్‌టౌన్‌ పోలీసులు సమావేశమయ్యారు. అదే సమయంలో మహా మండపం ఆరో అంతస్తులోని టాయిలెట్లలోకి చిట్టినగర్‌ వాగు సెంటర్‌కు చెందిన మహేష్‌ ప్రవేశించాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళలు టాయిలెట్ల లోపలకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునే తరుణంలో గోడపై నుంచి ఎవరో తమను చూస్తున్నట్లు గుర్తించారు. తలపైకి ఎత్తి చూసే సరికి మహేష్‌ కనిపించడంతో వారు కేకలు వేస్తూ బయటకు పరుగు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది కేకలతో అక్కడికి చేరుకున్న ఆలయ సిబ్బంది టాయిలెట్లలో ఉన్న మహేష్‌కు దేహశుద్ధి చేసి నాల్గో అంతస్తులో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువకుడి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతని ఫోన్‌ను తనిఖీ పోలీసులు తనిఖీ చేస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement