చల్లపల్లి: ఓ కారు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి ఒకదాని తరువాత ఒకటి చొప్పున రెండు ఆటోలను ఢీకొంది. చల్ల పల్లి – నడకుదురు రోడ్డులోని రాముడుపాలెం అడ్డరోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. చల్లపల్లి వైపు నుంచి నడకుదురు వైపు ప్రయాణిస్తున్న కారు రాముడుపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే మలుపుతిప్పే క్రమంలో అదుపుతప్పి రెండో వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా ఒకదాని వెనుక ఒకటి రెండు ఆటోలు వస్తున్నాయి. మొదటి ఆటోను డ్రైవర్ పూర్తిగా రోడ్డుపక్కకు తీసుకెళ్లినా అదుపుతప్పిన కారు ఢీకొంది. దీంతో ఆ ఆటో పక్కనున్న పంట బోదెలో పడిపోయింది. రెండో ఆటోను కూడా ఢీకొని కారు ఆగింది. పంటబోదెలో పడిన ఆటో డ్రైవర్, మరో ముగ్గురికి, రెండో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న పురిటిగడ్డ మాజీ సర్పంచ్ మాతంగి రమ్య తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించేందుకు 108 ఫోన్‌చేస్తే అందుబాటులో అంబులెన్సు అందుబాటులో లేదని చెప్పటంతో మరొక ఆటోలో చల్లపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.


