ఇంధన ఇబ్బంద్‌లు | - | Sakshi
Sakshi News home page

ఇంధన ఇబ్బంద్‌లు

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

ఇంధన ఇబ్బంద్‌లు

బంకుల వద్ద రెండో రోజూ భారీ క్యూలు డీజిల్‌ కోసం రైతులకు తప్పని కష్టాలు క్యాన్లతో మండుటెండలో నిరీక్షణ ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు పరిమితులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో డీజిల్‌, పెట్రోల్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం బంకుల వద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. గ్రామీణ ప్రాంతా ల్లోని బంకుల్లో డీజిల్‌ కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. ఇంధన కొరత రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల అవసరాలకు సరిపడా డీజిల్‌ అందుబాటులో లేనిపరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్‌, కార్లు, హార్వెస్టర్లకు డీజిల్‌ పంపిణీలో కోత విధించారు. ఒక్కో ట్రాక్టర్‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా డీజిల్‌ పంపిణీచేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో తెరిచి ఉన్న ప్రతి బంకు వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి. ఉదయం నుంచి రద్దీ కొనసాగుతోంది. దూరప్రాంత ప్రయాణాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారు పెట్రోల్‌ బంక్‌ల వద్దే గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంక్‌ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులను నియమించారు. ప్రతి బంక్‌లోనూ నగదు మాత్రమే స్వీకరిస్తూ ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి ఆన్‌లైన్‌ చెల్లింపులకు స్వస్తి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్ని వర్గాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో 321 బంకులు

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో మొత్తం 321 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఈ బంకుల్లో రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో లేదు. ఇంధనం లేక ఆదివారం మూత పడిన పలు బంకులు సోమవారం సైతం తెరుచుకోని పరిస్థితి నెలకొంది. బంకుల రోజు వారీ అవస రాల కంటే పది శాతం అదనంగా ఇంధనం అందుబాటులో ఉంచుతామని అధికారులు చెప్పినప్పటికీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని ప్రజలు మండిపడుతున్నారు. మొక్కజొన్న, వరి కోతలు వివిధ దశల్లో ఉన్నాయి. వరి కోతకు యంత్రాలు, కల్లాల్లో నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లు అవసరం. డీజిల్‌ కొరతతో ఈ యంత్రాలు నిలిచిపోయాయి. డీజిల్‌ కొరత కారణంగా రైతుల అవసరాలకు సరిపడా ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు మానుకుని బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరాలకు మించి డీజిల్‌, పెట్రోల్‌ పోయించుకోవడంతో సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇంధన కొరతను అధికారులు అంగీకరించడం లేదు. తిరువూరు, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరులపాడు, గంపలగూడెం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్క జొన్న చివరి దశకు వచ్చింది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు సరిపడా ఇంధనం పోయడం లేదు. పెనుగంచిప్రోలులో ఏడు బంకులు ఉండగా కేవలం ఒక్క బంకులోనే డీజిల్‌ అందుబాటులో ఉంది. దీంతో రైతులు ఆ బంక్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆయిల్‌ క్యాన్లతో పెద్ద క్యూ ఏర్పాటు చేశారు. ఇక్కడ కారు, ట్రాక్టర్‌, హార్వెస్టర్‌లకు రూ.1000, ఆటోలకు రూ.200 విలువైన డీజిల్‌ కొడుతున్నారు. క్యాన్లు తీసుకెళ్లిన వారికి పది లీటర్ల చొప్పున డీజిల్‌ పోస్తున్నారు. ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు ఆందోళన చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోనూ అరకొరగానే డీజిల్‌ లభిస్తోంది. ఇక్కడ ట్రాక్టర్‌కు 20 లీటర్ల చొప్పున పోస్తున్నారు. గంపలగూ డెంలో ఓ బంక్‌ వద్ద మండుటెండలో రైతులు క్యాన్లతో డీజిల్‌ కోసం నిరీక్షించారు. తిరువూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్లకు కూపన్లు అందజేస్తున్నారు. వత్సవాయి మండలంలో అందుబాటులో ఉన్న బంకుల్లో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున డీజిల్‌ పోస్తుండంతో రైతులు పనులు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెడ్డిగూడెంలో ఓ బంక్‌ వద్ద ట్రాక్టర్లు క్యూ కట్టాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో అక్వా రైతులు డీజిల్‌ కోసం ఓ బంక్‌ ఎదుట ఆందోళనకు దిగారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల బంకుల్లో ఇంధనం సరిపడా ఉంచా లని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement