జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు పక్కాగా ఇంటి పట్టాల పంపిణీ ఖాళీ స్థలాల పట్టాలు రద్దుచేస్తామన్న మంత్రి వ్యాఖ్యలు దారుణం మూడు సెంట్ల స్థలాల ఇస్తామన్న చంద్రబాబు హామీ అమలేదీ? వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని
ఐఏఎస్‌లతో అబద్ధాలు చెప్పిస్తున్నారు
మచిలీపట్నం(చిలకలపూడి): పేదల సొంతింటి కల నెరవేర్చింది మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టని వారి పట్టాలను రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు. పట్టాలు రద్దుచేస్తే బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మచిలీపట్నం మండలంలోని కరగ్రహారంలో ఉన్న జగనన్న కాలనీ డీ–బ్లాక్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, తనకున్న అనుభవం మరెవరీకీ లేదని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో మూడు సెంట్ల చొప్పున ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఏవని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పేదలకు ఇళ్ల పట్టాలు అందాయని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి రూ.10 వేల కోట్లతో భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చారని పేర్కొ న్నారు. మచిలీపట్నంలో సుమారు 320 ఎకరాల్లో 19,302 మంది లబ్ధిదారులకు ఒకటే లేఅవుట్‌లో పట్టాలు ఇచ్చారని, ప్రతి బ్లాక్‌కు ఒక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారని పేర్కొన్నారు. ఆ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను కూటమి నాయకులు తీసుకెళ్లి తమకు ఇష్టమొచ్చిన చోట ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం లేనందునే కాలనీలో ఇళ్ల నిర్మాణం ఆగిందని వివరించారు.
రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు
జగనన్న కాలనీల్లో పట్టాలు ఇచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు పక్కాగా స్థలాలు పంపిణీ చేశారని పేర్ని నాని స్పష్టంచేశారు. లబ్ధిదారులకు వారికి కేటాయించిన స్థలాలను జియో ట్యాగింగ్‌తో పాటు పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నాయకులు ఏదో ఒకటి చేస్తారని తెలిసే పక్కాగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. కొల్లు రవీంద్ర పేరుకే మంత్రని ఎక్కడ దోచుకుందామా, తిందామా అనే తపన తప్ప ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచించే ప్రసక్తే లేదని ఎద్దేవాచేశారు. పట్టాలు రద్దు చేసే సత్తా ముఖ్యమంత్రికి కూడా లేదని, లబ్ధిదారులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. లబ్ధిదారులు రెండు సంవత్సరాలు ఓపిక పడితే తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామన్నారు.
టిడ్కో ఇళ్లలో సౌకర్యాలు కల్పించాలి
రుద్రవరం గ్రామంలో టిడ్కో గృహాలను ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ అట్టహా సంగా ప్రారంభించారని పేర్ని నాని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆ గృహాల్లో లబ్ధిదారులు ఎందుకు నివాసం ఉండటం లేదో గ్రహించాలన్నారు. మంత్రి మాటలు నమ్మి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అధికారులు అంతరాత్మను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుడూ టిడ్కో గృహాల్లో నివాసం ఉండేలా సౌకర్యాలు కల్పించా లని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ లభించక పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు రైతులు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆడించే సత్తా ఉన్నా వాడుకునే శక్తి చంద్రబాబుకు లేదన్నారు. గాలులు తగ్గినందునే విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడాన్ని ఎద్దేవాచేశారు. విండ్ పవర్ ఇప్పటికీ ప్రతి సెకండ్‌కు నాలుగు మీటర్లు తగ్గకుండా ఉంటుందని, ఆ మాత్రం సమాచారం లేకుండా మంత్రి మాట్లాడటం బట్టి ఆయన పరిజ్ఞానం ఏపాటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ నాయకులు శీలం మారుతీరావు (బాబ్జి), గూడవల్లి నాగరాజు, చిటికిన నాగేశ్వరరావు, గాజుల భగవాన్, మొహమ్మద్ రఫీ, షేక్ మొహమ్మద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.


