పామర్రు: మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్ర బాబు పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తారని, సంబంధిత అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం ఉదయం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి పడిముక్కల మండలంలో కలెక్టర్ పర్యటించారు. మండలంలోని కపిలేశ్వరపురం వద్ద పొలాల్లో చేపట్టిన హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పమిడిముక్కల గ్రామంలో ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తరువాత వీరంకి లాకులు వద్ద ఎన్టీఆర్ కాలనీలో పింఛన్ల లబ్ధిదారులు చాగంటిపాటి సాయి ప్రసన్న, గుర్రం జగదీశ్వరి, కట్ట సుబ్బమ్మ తదితరులతో మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఉయ్యూరు ఇన్‌చార్జి ఆర్డీఓ పి.డి.హరిహరనాథ్, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణరావు, డ్వామా పీడీ శివ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ యుగంధర్, డీఎల్‌డీఓ రాజేష్, డీఎల్‌పీఓ సంపత్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దాడులు, వేఽధింపులకు గురైన మైనార్టీలు వెనకడుగు వేయక ధైర్యంగా ఫిర్యాదు చేయాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు మునవరి బేగం సూచించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆమె సోమవారం విజయవాడ వచ్చారు. గాంధీనగ ర్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో మైనారిటీలతో ప్రత్యేకంగా సమావేశమై, ముఖాముఖీ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మైనార్టీలు తమ అభిప్రాయాలు, సమస్యలను వినతిపత్రం రూపంలో కమిషన్ సభ్యురాలికి అందజేశారు. ఈ సందర్భంగా మునవరి బేగం మాట్లాడుతూ.. మైనార్టీలపై దాడులు, వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునేలా కమిషన్ పనిచేస్తోందన్నారు. అనంతరం నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జాతీయ మైనారిటీ కమిషన్ పర్యటిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గురు ద్వారా అధ్యక్షురాలు కరం వీర్‌కౌర్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.నవీన్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.చింతయ్య తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని కోరుతూ ధర్నా చౌక్‌లో ఫ్యాప్టో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షలు సోమవారంతో ముగిశాయి. మూడో రోజు నిరాహార దీక్ష శిబిరం నుంచి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ జూన్ నెలలో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మూడో రోజు దీక్షలను సీనియర్ నాయకుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చిరంజీవి మాట్లాడుతూ.. వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నదే తమ ప్రధాన డిమాండులని పేర్కొన్నారు. మే 31వ తేదీలోపు సమస్యలను పరిష్కరించకపోతే జూన్‌లో ప్రత్యక్ష కార్యాచరణకు ఫ్యాప్టో సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎం. కృష్ణయ్య, ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్లు కె.నర హరి, కాకి ప్రకాష్‌రావు, సీహెచ్.రమేష్, సీహెచ్.వెంకటేశ్వర్లు, బుప్యూటీ సెక్రటరీ జనరళ్లు ఎన్.వెంకటేశ్వర్లు, కె.బసవలింగా రావు తదితరులు పాల్గొన్నారు.


