పెట్రోల్‌ బంకులో కలెక్టర్‌, ఎస్పీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకులో కలెక్టర్‌, ఎస్పీ తనిఖీలు

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

పెట్రోల్‌ బంకులో కలెక్టర్‌, ఎస్పీ తనిఖీలు

గూడూరు: కృష్ణా జిల్లాలో డీజిల్‌, పెట్రోల్‌ కొరతపై ప్రజలు భయాందోళనలు చెంద వద్దని కలెక్టర్‌ డి.కె.బాలాజీ సూచించారు. మండల కేంద్రమైన గూడూరులో జాతీయ రహదారి వెంబడి ఉన్న పెట్రోల్‌ బంకును ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలసి కలెక్టర్‌ బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకు యాజమాన్యం, వాహనదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బంకులో ఆయిల్‌ సరఫరా నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. వాస్తవానికి జిల్లాలో డీజిల్‌ కొరత లేదన్నారు. ఆదివారం సాధారణంగా డీజిల్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు. యుద్ధం నేపథ్యంలో డీజిల్‌, పెట్రోలు దొరుకుతుందో లేదో అన్న భయాందోళనతో కొంత మంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. వాస్తవంగా వినియోగదారులకు అవసరమైనంత డీజిల్‌ అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయిల్‌ కంపెనీలు, మార్కెటింగ్‌ యజమానులందరితో మాట్లాడామని తెలి పారు. బంకుల్లో అవసరమైనంత డీజిల్‌ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అవసరానికి మించి డీజిల్‌, పెట్రోలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, విజిలెన్స్‌ డెప్యూటీ కలెక్టర్‌ పోతురాజు, సీఐ అబ్దుల్‌ నబీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement