రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకునేందుకు సైతం పోలీసు అధికారులు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు శాఖలను ఎంతలా దిగజార్చారో ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలను ఉద్దేశించి ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై గతంలో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఇంత వరకూ పట్టించుకోలేదు. దీంతో మరోసారి ఫిర్యాదు చేసేందుకు పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జిల్లా నేతలు నాయకులు సోమవారం పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లారు. అయితే వారి నుంచి ఉన్నతాధికారులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆ కార్యాలయంలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. అనంతరం కార్యాలయం బయట పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు.
పోలీస్ వ్యవస్థ బండారం బయటపడింది
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతల భార్యల గురించి ఏబీఎన్ రాధాకృష్ణ అగౌరవంగా మాట్లాడి కించపరిచాడని విమర్శించారు. ఏబీఎన్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా, ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందన్నారు. మహిళలను కించపరిచిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేస్తుంటే ఆ లెటర్ తీసుకోవటానికి కూడా భయపడుతున్నారని విస్మయం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా మహిళలు అంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బూతు చానల్‌లో మహిళలపై విమర్శలు
మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బూతు చానల్‌లో సభ్య సమాజం తలదించుకునేలా తమ కుటుంబ సభ్యులైన మహిళలపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇవే విమర్శలు వారి కుటుంబ సభ్యులపై చేసుకోగలరా అని ప్రశ్నించారు. ఈ విమర్శలను చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ సమ ర్థిస్తారా అని నిలదీశారు. చంద్రబాబుది రాక్షస ఆనందమని, అసభ్య పదజాలాన్ని ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. దీనిని తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా దిగజారి వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి రేపు తప్పక వస్తుందని హెచ్చరించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఏ రోజైనా తామే చెప్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏబీఎన్ రాధాకృష్ణ అంతలా బూతులు మాట్లాడుతున్నా చర్యలు తీసుకుండా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, మంత్రులు సమర్థ్ధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్ సీపీ జగ్గయ్య పేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, గుంటూరు పార్టీమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.
ఆయనపై ఫిర్యాదు తీసుకునేందుకు
భయపడుతున్న పోలీసులు
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు పొరపాటున చిన్న మాట మాట్లాడి, వెంటనే క్షమాపణ చెప్పినా జైల్లో వేశారని, మరి మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గతంలోనూ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, దానిపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మళ్లీ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాధాకృష్ణపై సాక్ష్యాధారాలు సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. మహిళలను కూటమి నేతలు ఇబ్బంది పెడుతున్నా చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


