కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం స్టేషన్‌లను ఆశ్రయించే బాధితులకు మేమున్నామంటూ సిబ్బంది భరోసా కల్పించాలన్నారు. వారి పట్ల మర్యాదగా మసలుకోవాలన్నారు. మొత్తం 46 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు
గన్నవరం: పెళ్లి రోజు భర్తతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ మహిళను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని కొండపావులూరు వద్ద బైపాస్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఆ మహిళ ఘటనా స్థలంలోని మృతి చెందగా ఆమె భర్త గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడలోని రాణిగారితోటలో నివసిస్తున్న సంగంరెడ్డి రాము, కుమారి దంపతుల పెళ్లి రోజు కావడంతో బైక్‌పై ద్వారకాతిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమైన ఆ దంపతులను మండలంలోని కొండపావులూరి పరిధిలోని జాతీయ రహదారి బైపాస్‌పై భారత పెట్రోలియం బంకు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి ఎగిరిపడడంతో కుమారికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త రాము మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారుపై ‘ప్రభుత్వ వాహనం’ అనే నంబర్ ప్లేట్ ఉండడం గమనార్హం. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య మృతితో భర్త రాము శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలికి ఇరువురు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


