బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బారికేడ్లు, తాళ్లు కట్టిన వైనం తెరచి ఉన్న ఒకటీ అర బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు లాక్ డౌన్ నాటి పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చుకుంటున్న ప్రజలు చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వం
అధికారుల పర్యవేక్షణేది?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత
విజయవాడ భవానీపురంలో తాత్కాలికంగా మూసివేసిన పెట్రోల్‌బంక్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారు లు బంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఏ బంక్ వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వాహనదారులకు సమాధానం చెప్పలేక కొందరు ఏకంగా బంకులు మూసివేశారు. బంకుల వద్ద అడ్డంగా తాళ్లు, బారికేడ్లు, ఆయిల్ డబ్బాలు పెట్టేశారు. కొన్ని బంకుల్లో యాజమాన్యం సిబ్బందిని కూడా పంపించి వేసింది. ఇంధనం స్టాక్ ఉన్న ఒకటి అర బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, రవాణా వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం వేచి ఉండటంతో ర్యాలీని తలపిస్తోంది. వాహనదారులు గంటల కొద్దీ క్యూలైన్‌లో పాట్లు పడుతున్నారు. మండుటెండలో ద్విచక్ర వాహనాలపై భార్య, చంటి పిల్లలతో వచ్చి నానా అవస్థలు పడ్డారు.
ఇదీ పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లాలో 186, కృష్ణా జిల్లాలో 145 మొత్తం 321 పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. వీటిల్లో 321 బంకు ల్లో డీజిల్ నిల్వలు లేవు. కేవలం 20 శాతం బంకుల్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. ఆదివారం ఉదయం నుంచి 80శాతం బంకులు మూసివేశారు. ఫలితంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల్లో పెట్రోల్ రూ. 100, రూ.200 మించి పోయడం లేదు. కార్లు, ఇతర వాహనాలకు పరిమితంగా పెట్రోల్ నింపుతున్నారు. కొన్ని బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నో స్టాక్.. నో స్టాక్..
బందరు రోడ్డులోని ఓ బంకు వద్ద భారీగా కార్లు నిలిచిపోయాయి. స్టేడియం వద్ద నుంచి బెంజ్ సర్కిల్ వర కు రోడ్డు పొడవునా కార్లు క్యూ కట్టాయి. విజయవాడ గాంధీనగర్‌లో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న బంక్ మూసివేశారు. అలాగే గొల్లపూడిలోని యూనియన్, రాఘ వయ్య పార్క్ సమీపంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న బంక్ సైతం మూతపడ్డాయి. ఆటోనగర్ ప్రాంతంలోని బంకులు మూసివేయడంతో వాహ నాలు నిలిచిపోయాయి. ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీ, నయారా, జియో బంకులు పూర్తిగా మూతవేశారు. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద రవాణా వాహనాలు నిలిపివేశారు. ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో ఏ బంకులోనూ డీజిల్ అందుబాటులో లేదు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే ట్రాక్టర్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ధాన్యం గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రవాణా నిలిచిపోయింది.
కానరాని డెలివరీ బాయ్స్
నగరంలో డీజిల్ ఆటోలు సగానికిపైగా రోడ్ల మీదకు రాలేదు. కొన్ని బంకుల్లో ఆదివారం ఉదయం నామ మాత్రంగా డీజిల్ విక్రయాలు జరిగాయి. వాటిల్లో ఆటోలు భారీగా క్యూ కట్టాయి. కొన్ని ఆటోలకు మాత్రమే డీజిల్ అందడంతో మిగిలిన వారు వెనుదిరిగారు. ఎక్కడైనా వాహనాలు నిలిచిపోతే బాటిల్‌లో పెట్రోల్ తెచ్చుకునేందుకు అవకాశం లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకుపోయే స్విగ్గీ, జొమాటో, ఇన్‌స్టామార్ట్ వంటి పలు సంస్థల డెలివరీ బాయ్స్ పెట్రోల్ కొరత కారణంగా పెద్దగా కనిపించలేదు. ఇంధన కొరత కారణంగా లాక్ డౌన్ నాటి పరిస్థితులు చూస్తున్నామని ట్రావెల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
ఇంధనం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వాహనదారులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేనిది ఒక్కసారి బంకులన్నీ నో స్టాక్ బోర్డులు పెట్టడం వెనుక కృత్రిమ కొరతేకారణమంటున్నారు. బంకులు మూసివేసినా ఏ ఒక్క అధికారి అటువైపు వచ్చి పరిస్థితిపై దృష్టి పెట్టలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ డీలర్లు బంకుల యాజమాన్యానికి అప్పు ఇవ్వడం లేదని, క్యాష్ అండ్ క్యారీ అనడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు.


