కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి క్షేత్రం నారాయణ మంత్రంతో మార్మోగింది. ఆలయంలో జరుగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞ ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక తిరుచ్చిపై స్వామివార్లను రుగ్వేద యాగశాలకు తీసుకువెళ్లి హోమక్రతువులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో రుత్వికులు 108 హోమగుండాల వద్ద ధన్వంతరి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 13 యాగశాలల్లో రుత్వికులు హోమక్రతువు జరపగ్గా, ఇష్టి హోమగుండాల వద్ద భక్తులు యజ్ఞానాన్ని నిర్వహించారు. 45మంది దంపతులు ధన్వంతరి మహాయజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. యజ్ఞం అనంతరం పూర్ణాహుతిని భక్తిప్రపత్తులతో జరిపారు. అనంతరం భక్తమండళ్ల సభ్యులు భజనలు చేస్తూ భక్తిగీతాలను ఆలపించారు. చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యజ్ఞాలు అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల వెంట నగరోత్సవాన్ని నిర్వహించారు.
పోలీసు అధికారుల పూజలు..
మహాయజ్ఞ ఉత్సవాల్లో అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, సీఐ యువకుమార్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అష్టాక్షరీ స్వామిజీ డీఎస్పీ, సీఐ దంపతులను సత్కరించి ప్రసాదాలను అందించారు. 29న జరిగే రాజగోపుర మహాకుంభ ప్రోక్షణకు ఏర్పాటు చేసే బందోబస్తుపై డీఎస్పీ అష్టాక్షరీ స్వామిజీతో చర్చించారు. ఎస్‌ఐ చాణిక్య–పూర్ణమాధురి దంపతులు ధన్వంతరి మహాయజ్ఞంలో పాల్గొన్నారు.
కనులపండువగా సాగిన
ధన్వంతరి మహాయజ్ఞం


