కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హెడ్‌కానిస్టేబుల్ కొండపల్లి శ్రామికనగర్ వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన అతను మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు కొండపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి ప్రభుకుమార్(56) వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొండపల్లి కొత్తగేటు సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోడ్డుపై పడిన ప్రభుకుమార్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. 108 వాహనంలో విజయవాడ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
మనసు ప్రశాంతతకు యోగా దోహదం
భవానీపురం(విజయవాడపశ్చిమ): తన జీవితాన్ని యోగా మార్చిందని, నిత్యం యోగా చేసేవారికి సాధారణ రోగాలు దరి చేరకపోవడంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ప్రముఖ యోగాచార్యులు, శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం(మంగళగిరి) వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం విజయవాడ నగర శాఖల ఆధ్వర్యంలో వెయ్యి యోగా శిక్షణా శిబిరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భవానీపురం –2 శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విరాట్ యోగా – 1000’ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత డాక్ట్ వేంకటేశ్వర యోగి జీవిత విశేషాలతో రూపొందించిన ‘అధునాతన యోగి – ఆదర్శ పథగామి’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. వెయ్యి శిక్షణ శిబిరాల్లో ఉచితంగా యోగా నేర్పిన గురువులు, సహకరించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భవానీపురం – 2 శాఖ అధ్యక్షుడు బొమ్మిశెట్టి తిరుమల రమేష్ మాట్లాడుతూ గురువులను సత్కరించి గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవానీపురం –2 శాఖ ఉపాధ్యక్షులు కొయ్య సూరిబాబు, ఊటుకూరి శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి తుమ్మలపెంట నాగేశ్వరరావు, కోశాధికారి కొత్తమాసు రత్నాకరరావు, మంజుల యోగి మాతాజి, వేమన యోగి గురూజీలు నిర్వహించారు.


