లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, అనాలోచిత విధానాలే కారణమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. ఇంధన సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా సాధారణ ప్రజలు, ఉద్యోగులు, రైతులు, రవాణా రంగానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోందని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని, అప్పట్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్ ధైర్యంగా, సమర్థవంతంగా పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


