ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసిన 12 మంది విద్యార్థులు తమ సెల్‌ఫోన్లను మోపెడ్ సీట్ కింద భద్రపరుచుకోగా, వాటిని చోరీ చేసిన ఘటన ఆదివారం జరిగింది. అమరావతిలోకి ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులు అమ్మవారినిని దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తమ బైక్‌లను కనకదుర్గానగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న క్యూకాంప్లెక్స్ కింద పెట్టి తమ సెల్‌ఫోన్లను ఒక మోపెడ్ సీట్ కింద బాక్స్‌లో భద్రపరుచుకున్నారు. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చే సరికి మోపెడ్ సీట్ తెరిచి ఉండటంతో కంగారుపడి చూడగా లోపల బ్యాగ్ కింద పెట్టిన 12 సెల్‌ఫోన్లు మాయమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ కెమేరాలను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.


