వ్యవసాయంపై పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభ ప్రభావం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంపై పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభ ప్రభావం

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

గుడివాడటౌన్‌: రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం ఏర్పడటం వల్ల వ్యవసాయంపై దాని ప్రభావం చూపుతోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌.నాగిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనేక పెట్రోల్‌ బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని, రబీ కోతకాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందన్నారు. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ అవసరమని, అయితే స్టాకు లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. ఆక్వారంగంలో దీని ప్రభావం కనిపిస్తోందని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి..

గోదావరి డెల్టాలో డీజిల్‌ సరఫరా గణనీయంగా తగ్గడంతో వరికోత, ధాన్యం రవాణా, సాగుపనులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వరికోత ఆలస్యంకావడం, పండిన పంట నేలపై రాలిపోవడం వలన దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని, ఇప్పటికే పెరిగిన ఇన్‌పుట్‌ ఖర్చులు (విత్తనాలు, కార్మికుల వ్యయం) మధ్య ఇంధన సంక్షోభం మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇంధన సరఫరా స్థిరపర్చడం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే డీజిల్‌ అందుబాటులో ఉంచడం అవసరమని సూచించారు. రైతులకు ప్రత్యేక కోటా కేటాయించి ఇంధన పంపిణీ పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement