పెనమలూరు: యువత భవిష్యత్తును దృష్టిలోఉంచుకోని రాష్ట్రంలో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ రవికృష్ణ అన్నారు. కానూరు స్కాట్‌స్పైస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఎస్‌ఆర్‌ఆర్ ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ –2026ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈగల్ వ్యవస్థ రక్షణ కవచంలా దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదవద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం సంస్థ లక్ష్యమన్నారు. భారతీయ యువతను బలహీనపరచటం ద్వారా దేశ భవిష్యత్తు దెబ్బతీయాలని విదేశీ శక్తులు చేస్తున్న కుట్రను యువత తిప్పికొట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే మహత్తర అవగాహన కార్యక్రమాన్ని ఈగల్ నిర్వహిస్తుందన్నారు. ఈగల్ కాల్ సెంటర్ 1972కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. చెస్ ఆడటం వలన యువత చురుకై న ఆటోచనలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏసీఏ చైర్మన్ కేవీవీ శర్మ, ఏసీఏ అధ్యక్షుడు ఎ.సురేష్, కార్యదర్శి కె.జగదీష్, టోర్నమెంట్ డైరెక్టర్ పి.రేణుక, పాఠశాల చైర్మన్ వీరమాచినేని వంశీ, డైరెక్టర్ వీరమాచినేని శాంతి, సీఈఓ కొడాలి జాహ్నవి, ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ.వీరాంజనేయులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.


