ఇబ్రహీంపట్నం: ఈలప్రోలు చేపల చెరువుల వివాదంలో టీడీపీ నాయకులు అరాచకాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. గుంటుపల్లికి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు కంచికచర్లకు చెందిన ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ రామకృష్ణను రంగంలోకి దించి మత్స్యశాఖ అధికారులకు మామూళ్లు ఇవ్వాలని చెరువు లీజుదారుడు బలే లక్ష్మణరావుతో రూ.1.10 లక్షలు ఫోన్‌పే చేయించారు. ఆ తర్వాత గుంటుపల్లి టీడీపీ నాయకులు ఆ నగదును తమకు ఫోన్‌పే చేయించుకున్నారు. మీడియాను మేనేజ్ చేయాలని ఓ పీడీఎఫ్ పేపర్ రిపోర్టర్‌ను లీజుదారుల వద్దకు తీసుకెళ్లి ఇతను మండలానికి పెద్ద రిపోర్టర్ అని పరిచయం చేసి రెండు సార్లుగా రూ.40 వేలు ఫోన్‌పే చేయించుకున్నారు. తిరిగి ఆ నగదు రిపోర్టర్‌కు కొంత ఇచ్చి మిగిలింది ప్రజాప్రతినిధి అనుచరులు నొక్కేశారు. విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు పెండింగ్ ఉందని అందుకే చేపల వాహనం అడ్డుకున్నామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొల్లేరు వాసులు విద్యుత్ శాఖకు కట్టిన డిపాజిట్ రూ.2.60 లక్షలు ఉందని, మీటర్ రద్దు చేసుకుంటే ఆ నగదు బకాయి కింద జమ చేసుకుంటారని చెబుతున్నారు. చేపల చెరువు వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


