కంచికచర్ల: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఆటోడ్రైవర్‌తో పాటు ప్రయాణికురాలు మృతి చెందిన ఘటన కంచికచర్లలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల మండలం కీసరకు చెందిన షేక్ బాబు(55) ఆటోడ్రైవర్ కిరాయి కోసం కంచికచర్ల వెళ్లాడు. అనంతరం కంచికచర్ల నుంచి నందిగామ కిరాయికి బయలుదేరాడు. కంచికచర్లలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కృష్ణమ్మ స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకునేందుకు కీసర ఆటో ఎక్కింది. కంచికచర్ల పేరకలపాడుపాడు పెట్రోలు బంక్ సమీపంలోకి రాగానే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కారు ముందు వెళుతున్న ఆటోను బలంగా ఢీకొంది. ఘటనలో ఆటోడ్రైవర్ బాబు అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో కందకంలోకి పల్టీ కొట్టి నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. ఆటోడ్రైవర్ బాబుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆటోడ్రైవర్‌తో పాటు మహిళ మృతి


