పోలీసుల సమక్షంలోనే మరోసారి దాడి
కొల్లేటి వాసులపై
కొల్లేరులో పరిచయమైన గుంటుపల్లికి చెందిన వ్యక్తుల ద్వారా ఈలప్రోలు చెరువుల లీజుకు తీసుకున్నాం. లీజు కాగితాలు అన్నీ వారు తయారు చేయించారు. లీజులో 25 శాతం వాటా వారే రాయించుకున్నారు. చివరకు చేపల చెరువులు కూడా మా నుంచి లాగేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సమస్య పరిష్కరించలేదు. స్థానికుల వైపే మొగ్గు చూపారు. మాకు న్యాయం చేసేవారు లేరు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కూడా దాడిచేశారు.
–బలే లక్ష్మణరావు,
చేపల చెరువు లీజుదారుడు
కొల్లేరు వాసులకు చేపలు, రొయ్యల సాగు తప్ప వేరే కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు అస్సలు తెలియవు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నేతలు మా ప్రాంతంలో సాగు చేసుకుంటే తాము అండగా ఉంటామని మాయమాటలు చెప్పి తీసుకువచ్చి ఇప్పుడు వారిని బెదిరిస్తూ దందాకు దిగుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి వారు సాగు చేసుకుంటుంటే పైసా కూడా పెట్టకుండా 25 శాతం వాటా తీసుకుంటున్నారు. అదీ కాక ప్రజాప్రతినిధికి ఇవ్వాలంటూ ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున గత ఎనిమిదేళ్లుగా రూ.80 లక్షలు కాజేశారు. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు ఎనిమిదేళ్ల లీజు కాలంలో నాలుగేళ్ల పట్టుబడి పూర్తిగా వారికిచ్చేయాలంటూ బెదిరిస్తున్నారు. ఇదేమి దౌర్జన్యమంటూ ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఈ విషయం ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాపం..ఆ కొల్లేరు వాసులు లబోదిబోమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువుల కోసం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు ప్రాంతంలో అనేక చేపల చెరువులు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన బలే లక్ష్మణరావు తన బంధువులతో కలసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామలోని 40 ఎకరాల సొసైటీ చెరువును ఏడాదికి రూ.10 లక్షలు లీజు చెల్లించి గడిచిన ఎనిమిదేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. దీంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన మరో 10 ఎకరాల్లో సొంతంగా చెరువు తవ్వించి ఏడాదికి రూ.10 లక్షల చొప్పున లీజు చెల్లిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధి అనుచరులుగా చెలామణి అవుతున్న గుంటుపల్లికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలు బలే లక్ష్మణరావును బెదిరించి చెరువులు స్వాధీనం చేసుకునే కుట్రలకు తెరతీశారు. చేపలు పట్టకుండా అడ్డుకుంటున్నారు. పట్టిన చేపలు అమ్మకానికి వెళ్లకుండా అడ్డు తగులుతూ అరాచకం సృష్టిస్తున్నారు.
బెదిరింపులతో అగ్రిమెంట్...
బలే లక్ష్మణరావు ఎనిమిదేళ్ల క్రితం ఈలప్రోలు గ్రామంలో ఓ సొసైటీకి చెందిన చేపల చెరువులు లీజుకు తీసుకునే సమయంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతల సహాయం కోరాడు. స్థానికులుగా తాముంటే మీ వ్యాపారానికి ఎటువంటి ఢోకా ఉండదని వారు నమ్మించారు. అవసరమైతే ప్రజాప్రతినిధి అండదండలు మీకు ఉండేలా చూస్తామని నమ్మబలికారు. అగ్రిమెంట్ తయారు చేయిస్తామని చెప్పి 25 శాతం వాటా వారికి కూడా ఉండేలా బెదిరించి రాయించుకున్నారు. అంతేకాకుండా ఏడాదికి చేపల చెరువుల లీజు రూ.80 లక్షలతో పాటు ప్రజాప్రతినిధికి ఇవ్వాలని గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి రూ.10లక్షల చొప్పున రూ.80 లక్షలు మొత్తం రూ.1.60 కోట్లు వసూలు చేశారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది. రెండేళ్ల క్రితం తీసుకున్న 10 ఎకరాలకు సంబంధించి 25 శాతం వాటాతో సంతృప్తి పడని పచ్చ నేతలు నాలుగేళ్లు పట్టుబడి మొత్తం తమకు వదిలేయాలంటూ లక్ష్మణరావుపై వత్తిడి చేయడం ప్రారంభించారు. లక్షలకు లక్షలు పెట్టుబడి తాము పెట్టి పట్టుబడి మీకు ఎలా వదిలేస్తామని లక్ష్మణరావు ఎదురుతిరిగాడు. దీంతో ఈ వివాదం సదరు ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. ఈ సందర్భంగా రూ.80 లక్షల నగదు విషయం కొల్లేరు వాసులు బయట పెట్టడంతో ఇరకాటంలో పడిన ప్రజాప్రతినిధి తన పేరుతో ఏడాదికి రూ.10లక్షలు వసూలు చేయడం ఏమిటని తన అనుచరులను సున్నితంగా మందలించారు. అయితే చేపల చెరువు పంచాయితీని ఎటూ తేల్చకుండా వదిలేయడంతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్నారు. పట్టిన చేపలను సైతం అమ్మకానికి తరలించకుండా అడ్డుకున్నారు. 20 రోజుల క్రితం లీజు చెల్లింపు విషయంలో మాటామాటా పెరిగి కొల్లేరు వాసులపై దాడికి తెగబడ్డారు. దాడి ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో 9 మందిపై ఫిర్యాదు చేశారు.
ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ...
చేపల చెరువుల్లో జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధి వద్ద చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయిందని కొల్లేరు వాసులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధి వివాదాన్ని ఎటూ తేలనివ్వడంలేదని, చెరువు వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తామే ఏర్పాటు చేశామని, జనరేటర్, కంటైనర్, ఇతరత్రా సుమారు రూ.75 లక్షల సామగ్రి ఉందన్నారు. సమస్య పరిష్కరిస్తే తమ సామగ్రి తాము తరలించుకు పోతామన్నారు. తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో టీడీపీ నేతల వివాదంలో చిక్కుకున్న చేపల చెరువు


