భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పరిశ్రమ ల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రైసిస్‌ గ్రూప్‌ (డీసీజీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి సంస్థ పటిష్ట భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరి అన్నారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నెల 30న జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం ఐవోసీఎల్‌ టెర్మినల్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేజర్‌ యాక్సిడెంట్‌ హజార్డ్‌ ఫ్యాక్టరీల్లో గ్యాస్‌ లీకేజ్‌, అగ్ని ప్రమాదాలు వంటివి జరక్కుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా సేఫ్టీ ఆడిట్‌ నివేదికలు పంపాలన్నారు. అత్యవసర సమయాల్లో స్పందించే విధానంపై కార్మికులకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు. సమావేశంలో కర్మాగారాల డెప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శివకుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాజు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, వివిధ పారిశ్రామిక సంస్థలు, కర్మాగారాల ప్రతినిధులు, భద్రతాధికారులు పాల్గొన్నారు.

కంటి ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలోని కంటి వైద్య ఆసుపత్రులు, క్లినిక్‌లు విధిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ సూచించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఆయుష్మాన్‌ భారత్‌ ఆధ్వర్యంలో శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కంటి వైద్యులు, ఎన్జీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ యుగంధర్‌ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ లేకుండా క్లినిక్‌లు, ఆసుపత్రులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా లభించే ప్రయోజనాలను వివరించారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్‌ జి.భానుమూర్తి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కృష్ణాజిల్లా ఐబాల్‌ సేకరణలో 510 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. పాఠశాల విద్యార్థుల కంటి పరీక్షల్లో రెండవ స్థానం, శుక్లాల శస్త్ర చికిత్సల్లో రాష్ట్రంలో టాప్‌ టెన్‌లో ఎనిమిదో స్థానం సాధించినట్లు తెలిపారు.

విద్య, పరిశోధనా రంగాల్లో మార్పులకు శ్రీకారం

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏడాది కాలంలో విద్య. పరిశోధన, పరిపాలన రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పులాల చంద్రశేఖర్‌ అన్నారు. ఆయన వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో పరిపాలనా పరంగా 27, 28వ స్నాతకోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌తో ప్రత్యేకంగా సమావేశమై అకడమిక్‌ ప్రమాణాల పెంపుపై చర్చించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పకడ్బందీ పర్యవేక్షణ కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. వైద్య విద్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ నిపుణులతో వెబెక్స్‌ సమావేశాలను నిర్వహించామన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని రీసెర్చ్‌డే నిర్వహించి పరిశోధనలకు పెద్దపీట వేశామన్నారు. వైద్య విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణపై ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.సాయిసుధీర్‌, పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుధ, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఐ.రమేష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement