మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ జిల్లాలో శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలో మొత్తం 25 పరీక్ష కేంద్రాల్లో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. జిల్లాలో మొత్తం 7567 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి చెప్పారు. పాలిసెట్ పరీక్ష ఫలితాలతో పాటుగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తారని ఆయన తెలిపారు.


