ప్రభుత్వ నిర్లక్ష్యం..మొక్కజొన్న రైతులకు శాపం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యం..మొక్కజొన్న రైతులకు శాపం

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

పామర్రు: ఏపీలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నారని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన దళారుల చేతిలో మోస పోతున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా రైతులు రూ.1400 నుంచి 1600 మధ్యలోనే అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ రబీలో వరి తర్వాత 12.35 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగిందన్నారు. సుమారు రూ.35 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఆ క్రమంలో రైతులు సుమారు రూ.2500 కోట్ల వరకు నష్ట పోతారని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా మూడేళ్ల కాలంలో సుమారు రూ.8లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, యూపీలలోని ప్రభుత్వాలు కనీస మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే, మన రాష్ట్రంలో ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, పోటీని పెంచి దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌చేశారు. లేని పక్షంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement