విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురువు త్యాగరాజ స్వామి 259 వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలోని భారతీ తీర్థ శ్రవణ సదనంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు శృతి,లయ సమన్వితంగా సాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాల, యువ, విద్వాంసులు త్యాగరాజ స్వామికి కృతి సమర్పణ చేస్తున్నారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సురవరపు ఉమ, సురవరపు విద్యలను త్యాగరాజ స్వామి కృతులను మధురంగా గానం చేశారు. వీరుభట్ల సీతారమణి, చింతలపల్లి సువర్ణలక్ష్మి, కె.శివానీ, బీహెచ్ శైలజ, కాశీభట్ల ఉమ, లంక తేజస్వి, శింగరాజు కల్యాణి, సీనియర్ విద్వాంసులు టీకేవీ రామానుజా చార్యులు, అంజనా సుధాకర్, పోపూరి రామచరణ్ త్యాగరాజ స్వామి కృతులను గానం చేశారు. చలమేలరా, శోభిల్లు సప్తస్వర, మాకేలరా, దొరుకునా ఇటువంటి సేవ తదితర కీర్తనలు చోటు చేసుకున్నాయి.
గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి
ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ స్వామి గురుపరంపర సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచంచారు. సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, పి.గాయత్రి గౌరీనాఽథ్, హరిప్రసాద్ పాల్గొన్నారు.
కస్టడీకి దేవదాయ శాఖ
అసిస్టెంట్ కమిషనర్ శాంతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని విచారణ నిమిత్తం ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఆమెను విజయవాడ జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.


