ఆలయ ప్రాంగణంలో వేసవి ఏర్పాట్లు భక్తులకు మజ్జిగ పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు రద్దీ కనిపించగా, సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవార్చన వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ సమయాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసిన దేవస్థానం శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అంతరాలయ దర్శనాన్ని తిరిగి ప్రారంభించారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టేలా గ్రీన్ మ్యాట్‌లను ఏర్పాటు చేసింది. భక్తులకు మంచినీటి సదుపాయంతో పాటు ఘాట్‌రోడ్డు, క్యూలైన్లు, లక్ష్మీ గణపతి విగ్రహం వంటి కీలక ప్రాంతాల్లో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు సేవలో పాల్గొన్నారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దర్బారు సేవ, పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు.


