కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు శుక్రవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ లాంఛనంగా ప్రారంభించారు. టాటా ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్ తదితర కంపెనీలు10కి పైగా కృష్ణా యూనివర్సిటీకి విచ్చేసి విద్యార్థులను ఎంపిక చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గతేడాది మాదిరిగా ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశం కల్పించి ఈ నెలాఖరులో అచీవర్స్ డే పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈరోజు జరిగిన ప్రాంగణ ఎంపికల్లో వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి 228 మందిని ఫైనల్ రౌండ్‌కి ఎంపిక చేసినట్టు వర్సిటీ ప్రాంగణ ఎంపికల డైరెక్టర్ ఆచార్య వైకే సుందర కృష్ణ తెలిపారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని మే ఒకటో తేదీన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరుగనుంది. ఒకటో తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5.55గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా సిద్ధం చేసిన పూలవాహనంపై శ్రీగంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామివార్లు కొలువై ఉండగా ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమై కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కలరా హాస్పిటల్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణవీధి మీదుగా ఆలయానికి చేరుకుంటుంది.


