మహిళా రిపోర్టర్‌పై టీడీపీ నేత దాడి | - | Sakshi
Sakshi News home page

మహిళా రిపోర్టర్‌పై టీడీపీ నేత దాడి

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

మహిళా రిపోర్టర్‌పై టీడీపీ నేత దాడి జాతీయ రహదారిపై ధాన్యం బస్తాల ట్రక్కు పల్టీ

ఇసుక అక్రమ రవాణాపై

కవరేజ్‌కు వెళ్లిన సమయంలో ఘటన

కృత్తివెన్ను: అక్రమంగా ఇసుక రవాణా తీరుపై న్యూస్‌ కవరేజీ కోసం వెళ్లిన మహిళా రిపోర్టర్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో శుక్రవారం అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో 99 టీవీ పెడన నియోజకవర్గ రిపోర్టర్‌ కె.మాధవి కవరేజీ కోసం వవెళ్లారు. అక్కడ టీడీపీ నేత సూరగాని బ్రహ్మం ఆమెను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఇసుక తోలడానికి అనుమతులు ఉన్నాయా అని అడగ్గా, ‘మాకు ఎమ్మెల్యే పర్మిషన్‌ ఇచ్చారు. మా ఇష్టం మేము తోలుకుంటాం’ అని మాట్లాడారు. వీడియో తీస్తున్న మాధవి ఫోన్‌ను బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. మాధవికి తోడుగా వచ్చిన మరో చానల్‌లో పనిచేసే ఆమె భర్త హరీష్‌పై సైతం దౌర్జన్యానికి తెగబడ్డాడు. ప్రాణభయంతో తిరిగి వచ్చేస్తున్న వారిని వెంబడించి దారికాచి ఫోన్‌లో తీసిన వీడియోలను బలవంతంగా డిలీట్‌ చేయించాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పైడిబాబు పేర్కొన్నారు.

29న ఐవోసీఎల్‌ టెర్మినల్‌లో మాక్‌డ్రిల్‌

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌):జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నెల 29న జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం ఐవోసీఎల్‌ టెర్మినల్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ తెలిపారు. జేసీ ఎస్‌.ఇలక్కియ శుక్రవారం రెవెన్యూ, అగ్నిమాపక, కర్మాగారాలు, పరిశ్రమలు, విద్యుత్‌, కాలుష్య నియంత్రణ, ఆర్‌ అండ్‌బీ, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యం తదితర సమన్వయ శాఖల అధికారులతో మాక్‌డ్రిల్‌ సన్నద్ధతా సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసాయన ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ స్పందన, సమన్వయం, ప్రజల రక్షణ చర్యలు అత్యంత కీలకమని తెలిపారు. మాక్‌ డ్రిల్‌ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, విపత్తు నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ఈ మాక్‌ డ్రిల్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, పీసీబీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డెప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఎంవీ శివకుమార్‌, డీపీవో పి.లావణ్య కుమారి పాల్గొన్నారు.

తృటిలో తప్పిన ప్రమాదం

చల్లపల్లి: ఽదాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ ట్రక్టు అదుపుతప్పి 216 జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం పల్టీ కొట్టింది. వివరాల్లోకి వెళితే మంగళాపురంలో ధాన్యం బస్తాలను ట్రక్కులో నింపుకుని లోడును మండల పరిధిలోని వక్కలగడ్డ రైస్‌మిల్‌ వద్ద దిగుమతి చేసేందుకు ట్రాక్టర్‌ బయలుదేరింది. జాతీయ రహదారిపై లక్ష్మీపురం పంచాయతీ శివారు నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే ట్రాక్టర్‌ వెనుక ఉన్న ట్రక్కు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఘటనలో ట్రక్కులోని ధాన్యం బస్తాలు అన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

మే 12,13,14 తేదీల్లో

వైజాగ్‌లో బాక్సింగ్‌ పోటీలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి శాప్‌ లీగ్‌ బాక్సింగ్‌ పోటీలను మే 12,13,14 తేదీల్లో నిర్వహిస్తామని శాప్‌ కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత క్రీడాకారులు, కోచ్‌లు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ పొందే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని శాప్‌ కార్యాలయ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం నిర్వహిస్తామని గతంలో ప్రకటించామన్నారు. ఎంపికలను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, అప్‌డేట్స్‌ కోసం స్పోర్ట్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను వీక్షించాల్సిందిగా కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement