5 కేజీల గంజాయి స్వాధీనం ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
గన్నవరం: మండలంలోని కొండపావులూరు గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... మండలంలోని గోపవరపుగూడెం గ్రామానికి చెందిన బేతపూడి వంశీకృష్ణ(23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బైక్‌పై వెళ్లిన వంశీకృష్ణ తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. రాత్రి సమయంలో తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో బైపాస్ రోడ్డులోని కొండపావులూరు అండర్ పాస్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పంట బోదెలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో వంశీకృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గ్రామస్తులు ఉదయం వంశీకృష్ణ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మృతుని తల్లి ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా కుటుంబ కలహాల కారణంగా భార్య గత నెల రోజులుగా పుట్టింటి వద్ద ఉంటోంది.
సింగ్‌నగర్‌లో మరో గంజాయి ముఠా అరెస్ట్
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో గంజాయి ముఠా శుక్రవారం పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ తోటవారి వీధి చివరలో గంజాయి విక్రయిస్తూ నలుగురు వ్యక్తులు గురువారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను విచారించిన పోలీసులు సింగ్‌నగర్ లూనాసెంటర్, లెనిన్‌సెంటర్ ప్రాంతాల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా తేలింది. దీంతో పోలీసులు రామానగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద దాడులు నిర్వహించగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా వారి వద్ద 5 కేజీల గంజాయి లభ్యమైంది. గత కొంతకాలం నుంచి గంజాయి విక్రయిస్తున్నట్లుగా నిందితులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు తాడేపల్లి నాగబాబు(22), బూదాల విజయ్(30), పరిటాల జోజిబాబు అలియాస్ సిద్ధు(19), దాసరి వంశీ(24), మిండాల రత్నకుమార్ అలియాస్ బొంత(19) అనే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా వారికి రిమాండ్ విధించింది.
మద్యం అక్రమ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ డిస్మిస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మద్యం అక్రమ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన పక్షంలో రెండు వారాల పాటు ఇంటీరియమ్ ప్రొటెక్షన్ కొనసాగించాలని సుప్రీం కోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోగా రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని ఆర్డర్‌లో పేర్కొంది.


