చిన్నారుల విక్రయం కేసులో మరో ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల విక్రయం కేసులో మరో ముగ్గురు అరెస్టు

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

చిన్నారిని రక్షించిన పోలీసులు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వెల్లడి

పెనమలూరు: చిన్నారులను విక్రయించిన కేసులో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పెనమలూరు పీఎస్‌ పరిధిలో కిడ్నాప్‌కు గురైన 10 నెలల చిన్నారి కేసులో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశామని తెలిపారు. అరెస్ట్‌ అయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నెల 22వ తేదీన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి మరో చిన్నారిని కాపాడామని తెలిపారు.

మరో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్‌

కాగా చిన్నారులను విక్రయించిన కేసులో శుక్రవారం మరో ముగ్గురు వ్యక్తులను అనెస్ట్‌ చేశామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన గండికోట ఏసుబాబు, నిడమానూరుకు చెందిన అమరాపు శారద, విజయవాడకు చెందిన ఆముదాలపల్లి సత్యమణి ఉన్నారని తెలిపారు. యనమలకుదురుకు చెందిన దేవళ్ల భవాని, గోపయ్యల కుమారుడిని ఆముదాలపల్లి సత్యమణి గుడివాడలో ఒక కుటుంబానికి విక్రయించిందని, ఆ చిన్నారిని గుర్తించి రక్షించామని చెప్పారు.

ఆపరేషన్‌ ట్రేస్‌

కిడ్నాప్‌ అయిన చిన్నారుల కోసం ఆపరేషన్‌ ట్రేస్‌ పేరుతో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆరుగురు చిన్నారులను కిడ్నాప్‌ చేసి విక్రయించినట్లు విచారణలో గుర్తించామని, వారిలో ముగ్గురు చిన్నారులను కాపాడామన్నారు. ఇటీవల ఆటోనగర్‌లో జరిగిన కిడ్నాప్‌లో కూడా ఆముదాలపల్లి సత్యమణి సహకారంతో ఏసుబాబు, శారద, గంటా మేరీ, కనకం పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. సత్యమణి గతంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట, విజయవాడ సమీపంలోని నున్నలో చిన్నారులను విక్రయించిన కేసుల్లో అరెస్ట్‌ట్‌ అయిందని తెలిపారు. ఈ కేసును అన్నికోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏపీ డీజీపీ, ఏలూరు రేంజ్‌ ఐజీపీ ఆదేశాలతో ఆపరేషన్‌ ట్రేస్‌ పేరుతో దర్యాప్తు జరుగుతుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement