దళారులను నమ్ముకొని నష్టపోయాం
మార్కెట్ యార్డు, రోడ్లపైనే మగ్గుతున్న మొక్క జొన్న కనీస మద్దతు ధర ఊసే ఎత్తని ప్రభుత్వం ఎన్టీఆర్‌లో 45,500, కృష్ణా జిల్లాలో 18,250 ఎకరాల్లో జొన్న సాగు పట్టించుకోని ప్రభుత్వం
ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: మొక్కజొన్న రైతుకు మద్దతు ధర దక్కకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట చేతికొచ్చి దాదాపు నెలరోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో మొక్కజొన్న కల్లాలు, మార్కెట్ యార్డుల్లో మగ్గుతోంది. దళారులకు అమ్మలేక, ప్రభుత్వ కనీస మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు, తాము పడుతున్న కష్టాన్ని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు.
రూ.153 కోట్లకు పైగా నష్ట పోతున్న రైతులు
ఎన్టీఆర్ జిల్లాలో 45,500, కృష్ణాలో 18,250 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఎకరాకు సరాసరిన 30–35 క్వింటాల దిగుబడులు వచ్చాయి. మొక్క జొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్నను క్వింటాకు రూ.1600 నుంచి 1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 20.40 లక్షల క్వింటాళ్ల జొన్న దిగుబడులు వచ్చాయి. రైతులు క్వింటాకు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రూ.750 నష్టపోతున్నారు. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు రూ.153 కోట్ల మేర కోల్పోతున్నారు.
మినుము, పెసర పంటలదీ అదే పరిస్థితి
పంట చేతి కొచ్చే సమయంలో ధరలు పతనమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో మినుము 3.25 లక్షల ఎకరాలు, పెసర పంట 18వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మినుము పంట దిగుబడులు వస్తున్నాయి. నెలరోజుల క్రితం క్వింటాలు రూ.8,400కు మినుములను కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటా రూ.7700కు కొనుగోలు చేయడంతో రైతు క్వింటాకు రూ.700 నష్టపోతున్నారు. పెసలు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
ఇరవై ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రభుత్వం మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకొని నష్టపోయాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకురూ.600 నుంచి 700 చొప్పున.. సరాసరిన ఎకరాకు 20వేలకు పైగా నష్టపోయాం. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు.
– ఉయ్యూరు మల్లారెడ్డి, రైతు, వేములపల్లి, కంచకచర్ల మండలం
మాది తోట్లవల్లూరు మండలంలోని తోడేళ్ల లంక దిబ్బ గ్రామం. 5 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నాను. గతంలో కృష్ణా నది వరదలతో మినుము పూర్తిగా పాడైంది. తర్వాత మొక్క జొన్న సాగు చేస్తున్నాను. చాలా అప్పు చేశాను. ప్రస్తుతం ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు పండే అవకాశముంది. ఈ ఏడాది ఈదురు గాలులకు దిగుబడి తగ్గింది. ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నను కొనుగోలు చేయడం లేదు. దళారులకు విక్రయించి నష్టపోతున్నాం.
– గంగిశెట్టి సత్యనారాయణ,
తోడెళ్ల లంక దిబ్బ, తోట్లవల్లూరు, కృష్ణా


