ఎన్టీటీపీఎస్‌ 8వ యూనిట్‌లో వంద రోజుల వేడుక | - | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌ 8వ యూనిట్‌లో వంద రోజుల వేడుక

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

ఎన్టీటీపీఎస్‌ 8వ యూనిట్‌లో వంద రోజుల వేడుక రాజమండ్రి–కాకినాడ పోర్టు ప్యాసింజర్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ‘హజ్‌’ ఏర్పాట్లలో కూటమి విఫలం రౌడీషీటర్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజమండ్రి జైలుకు తరలింపు

ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్‌ 8వ యూనిట్‌ నిర్విరామంగా వంద రోజులు పనిచేసిన సందర్భంగా శత దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వేడుకల్లో ఏపీజెన్‌కో డైరెక్టర్‌ (థర్మల్‌) పి.అశోక్‌ కుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ పి.శివ రామాంజనేయులు కేక్‌ కట్‌ చేసి ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 2023లో స్టేజ్‌ 5 (800 మెగా వాట్స్‌) ప్రారంభించారన్నారు. తొలిరోజుల్లో ఆటుపోట్లు ఎదురైనా అనంతరం విద్యుత్‌ ఉత్పత్తిలో 100 రోజులు నిరంతరాయంగా పని చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య ఇంజినీర్లను సత్కరించారు. పర్యవేక్షక ఇంజినీర్లు ఎం.మారుతీప్రసాద్‌, రవికిరణ్‌, డి.రమణయ్య, పి.ప్రసాద్‌, పి.అనురాధ, ఎన్‌.శివప్రసాద్‌, వెంకటరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు రాజమండ్రి–కాకినాడ పోర్టు మధ్య రెగ్యులర్‌ మెమో రైలుకు రైల్వే బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రత్యేక రైలుగా నడుస్తున్న రాజమండ్రి–కాకినాడ పోర్టు (07523/07524) రైలును రెగ్యులర్‌ ప్యాసింజర్‌గా క్రమబద్ధీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి రాజమండ్రి–కాకినాడ పోర్టు (67301) మెమో రైలు, 28 నుంచి కాకినాడ పోర్టు–రాజమండ్రి (67302) రెగ్యులర్‌ సర్వీస్‌గా నడవనున్నాయి.

షెడ్యూల్‌ ఇది

రాజమండ్రి–కాకినాడ పోర్టు (67301) ప్యాసింజర్‌ రైలు ప్రతిరోజూ రాత్రి 10.40 గంటలకు రాజమండ్రిలో బయలుదేరుతుంది. అక్కడ నుంచి 10.56కి ద్వారంపూడి, 11.04కి అనపర్తి, 11.14కి బిక్కవోలు, 11.22కి మెడపాడు,11.32కి సామర్లకోట, 11.44కి కాకినాడ టౌన్‌, మధ్యరాత్రి 12.04 గంటలకు పోర్టుకు చేరుకుంటుంది.

(67302) ప్యాసింజర్‌ ఉదయం 6.15 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరుతుంది. అక్కడ నుంచి 6.23కి కాకినాడ టౌన్‌, 6.38కి సామర్లకోట, 6.48కి మెడపాడు, 6.56కి బిక్కవోలు, 7.04కి అనపర్తి, 7.12కి ద్వారంపూడి, ఉదయం 8.15కి రాజమండ్రి చేరుకుంటుంది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం హజ్‌ యాత్రికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సరైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎన్టీఆర్‌ జిల్లా మైనార్టీ నేతలు విమర్శించారు. ఏటా వేలాది మంది ముస్లింలు పవిత్ర హజ్‌ యాత్రకు వెళ్లే సందర్భంలో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం మైనార్టీ నేతలు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, సయ్యద్‌ అలీం, ఎండీ రిజ్వాన్‌ మాట్లాడుతూ విమాన, వసతి, వైద్య సేవలు, ఆహారం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వ లోపాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇది మైనార్టీల సౌకర్యాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో హజ్‌ యాత్రికులకు అత్యుత్తమ ఏర్పాట్లు చేసి, యాత్ర సాఫీగా సాగేలా చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఉమర్‌, ఫజులుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గంజాయి కేసుల్లో నిరిమాండ్‌ ఖైదీగా ఉన్న గుంటూరు ప్రవీణ్‌కుమార్‌ను పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద గురువారం రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రవీణ్‌కుమార్‌పై భవానీపురం పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. ఇతనిపై అనేక గంజాయి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ను పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం రాజమండ్రి జైలుకు తరలించినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. గంజాయి కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement