హాబీగా పుస్తక పఠనం | - | Sakshi
Sakshi News home page

హాబీగా పుస్తక పఠనం

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

కోనేరుసెంటర్‌: విద్యార్థులు పుస్తక పఠనాన్ని హాబీగా అలవరచుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వ విద్యాలయ సెంట్రల్‌ లైబ్రరీలో గురువారం నిర్వహించిన ప్రపంచ పుస్తక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రముఖులు ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడంతో ఉన్నతస్థాయికి చేరుకున్నారన్నారు. ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తున్నా పుస్తక పఠనాన్ని దిన చర్యలో భాగంగా మలచుకోవడం అవసరమన్నారు. రిజిస్ట్రార్‌ ఎన్‌. ఉష మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో భాషా పరిజ్ఞానం చాలా ముఖ్యమన్నారు. అది పుస్తక పఠనంతో పెంచుకోగలమన్నారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే ఉత్తర భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఏపీజే అబ్దుల్‌ కలాం సెంట్రల్‌ లైబ్రరీ సమన్వయకర్త డాక్టర్‌ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్‌ రమణ, కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు సహాయ ఆచార్యులు వరుణకుమారి గ్రంథాలయాల ఆవశ్యకత, పుస్తక పఠనంపై ప్రసంగించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విద్యార్థులు ప్రసంగించారు. తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగంతో పాటు అరుదైన, విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

కేయూ ఉపకులపతి ఆచార్య రాంజీ

Advertisement
 
Advertisement
Advertisement