జిల్లాల విభజన తర్వాత ఆస్పత్రికి పెరిగిన ప్రాధాన్యం భారీగా నమోదవుతున్న ఓపీ ఆ మేరకు సౌకర్యాల కల్పనలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం వేధిస్తున్న సిబ్బంది కొరత
సిబ్బంది లేకుండా సేవలు ఎలా?
జిల్లా పెద్దాస్పత్రిలో రోగులు ఎక్కువ.. సేవలు తక్కువ
సర్వజన ఆస్పత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం బహిరంగ రహస్యమే. ఐసీయూలో వెంటిలేటర్లు లేవు, ఎంఆర్‌ఐ అన్నివేళలా పనిచేయదు. సిబ్బంది కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ర్యాంకుల ప్రచారం చేస్తూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. రెండేళ్ల పాటు మౌనం పాటించి, ఇప్పుడు మంత్రి హడావుడిగా తనిఖీ చేయడం కంటి తుడుపు చర్య తప్ప మరొకటి కాదు.
– బూర సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా
గత రెండేళ్లుగా ఆస్పత్రిలోని సమస్యలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. కంటి ఓపీ మొదటి అంతస్తులో ఉండటంతో వృద్ధులు, వికలాంగులు మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు స్థానికంగా నివసించకపోవడంతో అత్యవసర సేవలు కుంటుపడుతున్నాయి. రోగుల సహాయకుల కోసం దాతలు కట్టించిన భవనాన్ని ఇతర అవసరాలకు వాడుతుండటం బాధాకరం.
– శేకుబోయిన సుబ్రహ్మణ్యం,
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కృష్ణా జిల్లా
●
మచిలీపట్నంఅర్బన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజన, మెడికల్ కాలేజీ ఏర్పాటు తర్వాత బందరులోని సర్వజన ఆస్పత్రికి ప్రాధాన్యం పెరిగింది. అయితే గత రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రి పరిస్థితి దిగజారింది. జిల్లాలోని పేద రోగులకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆస్పత్రి సమస్యలతో కూనరిల్లుతోంది. పరికరాలు కొరత.. అరకొర సిబ్బంది.. దారుణంగా సౌకర్యాలు.. వెరసి రోగులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది.
పెరిగిన ఓపీ..
ఆస్పత్రిలో గతంలో రోజుకు 350–400 వరకు ఉన్న ఔట్‌పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్లు.. జిల్లా ముఖ్య కేంద్రంలో ప్రధాన, బోధనా ఆస్పత్రి కావటంతో
ఇటీవల 1,250కి పెరిగాయి. ఫలితంగా ఔట్‌పేషెంట్ రిజిస్ట్రేషన్లలో రాష్ట్ర స్థాయిలో సర్వజన ఆస్పత్రి మూడో స్థానానికి చేరుకుంది. అయితే ఆస్పత్రిలో సిబ్బంది నియామకాలు, మౌలిక వసతుల కల్పన, ఆధునిక పరికరాల ఏర్పాటు, పడకల సంఖ్య పెంపు వంటి కీలక చర్యలు చేపట్టకపోవడం.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సుస్పష్టం చేస్తోంది.
మంత్రి హడావుడి పర్యటన..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ఆకస్మిక తనిఖీ చేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఇంతకాలం ఆస్పత్రి సమస్యలను పట్టించుకోని మంత్రి, ఒక్కసారిగా హడావుడిగా తనిఖీలు చేపట్టడాన్ని ఓపీ రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలో మూడో స్థానానికి చేరిందంటూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే స్టంట్‌గానే పలువురు అభివర్ణిస్తున్నారు. పెరిగిన రోగుల అవసరాలకు తగ్గట్టు వసతులు కల్పించాల్సిన బాధ్యతను మంత్రి విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నిధుల కొరత..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయలేదు. గతంలో అభివృద్ధి కమిటీలు పనిచేసినప్పుడు ఆస్పత్రి అవసరాలకు అనుగుణంగా నిధులు లభించేవి. ప్రస్తుతం అత్యవసర మందులు, అభివృద్ధి పనుల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ నిధులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
వెంటిలేటర్లు లేవు..
ఆస్పత్రి ఐసీయూలో సదుపాయాలు పరిమితంగానే ఉన్నాయి. ఇక్కడ రెండు ఐసీయూ విభాగాలు ఉండగా, ప్రతి విభాగంలో రెండు చొప్పున మొత్తం నాలుగు వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదనంగా అనస్థీషియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉన్నప్పటికీ, వాటిలో రెండు మరమ్మతుల కారణంగా వినియోగంలో లేవు.
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం..
ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్ సెంటర్ నిబంధనల ప్రకారం 24 గంటలు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పరిమితమవుతోంది. సాయంత్రం తర్వాత సిబ్బంది లేకపోవడంతో అత్యవసర రోగులకు పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. ఈ యంత్రం పాతది కావడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
వైద్యాధికారుల గారడీ!
ఆస్పత్రిలో విధులు నిర్వర్విస్తున్న ఉన్నత వైద్యాధికారులు, వైద్యనిపుణులు, ప్రొఫెసర్లు, వైద్యులు తదితరులలో అధిక శాతం విజయవాడ, గుంటూ రు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు ముగిసే సమయం కాకముందే, సాయంత్రం 4 గంటల నుంచే ఉమ్మడిగా ఆస్పత్రిని విడిచి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. అత్యవసర సేవలు అవసరమైన సమయంలో కూడా అందుబాటులో ఉండటం లేదు. అయితే హౌస్ రెంట్ అలవెన్స్ పొందేందుకు కొందరు అధికారులు ఆధార్ కార్డుల్లో చిరునామాలను మార్పు చేసుకుని, స్థానికులుగా చూపించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్ర స్థాయికి చేరింది. నిబంధనల ప్రకారం కనీసం 180 మంది నర్సులను నియమించాల్సి ఉండగా కేవలం 90 మందిని మాత్రమే నియమించారు. నర్సులే కాకుండా వైద్య సిబ్బంది కూడా తగిన సంఖ్యలో లేకపోవడంతో సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొందరు వైద్యులు, పరిమిత సిబ్బందితోనే ఎక్కువ రోగుల భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కీలక విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


