పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను వసూళ్లు చేసినందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం సాయంత్రం జయప్రకాష్ నగర్‌లోని స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా)లో నిర్వహించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, రాష్ట్ర స్థాయి మునిసిపల్ కమిషనర్ల వర్క్‌షాప్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రను సన్మానించారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఈ ఘనత వీఎంసీ సిబ్బంది సమష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాగ నరసింహారావు, విజయవాడ నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు.
రామవరప్పాడు: విజయవాడరూరల్ మండలం రామవరప్పాడు వాటర్ ట్యాంక్ సమీపంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనంపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనకదుర్గానగర్‌లో తాండ్రిక శ్రీను(43) తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. శ్రీను మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈనెల 21న సాయంత్రం 5గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీను రెండు రోజులైనా తిరిగి రాలేదు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనంపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మద్యం మత్తులో ఈ భవనంపైకి ఎక్కి పడుకోవడంతో ఎండ దెబ్బకు మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయి రెండు రోజులు కావడంతో ఎలుకలు మృతదేహం కళ్లు, శరీర భాగాలను కరిచాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురిని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ కార్యకాలాపాలకు పాల్పడుతున్న ఉస్తేల చిన్నబాబు అలియాస్ నల్లోడు, తెల్లగడ్డ రమేష్ అలియాస్ ముట్టే మున్న, షేక్ జాన్‌బాషా, కూసం వెంకట దినేష్, లంకలపల్లి సాయికిరణ్ అలియాస్ దొంగసాయి, గుంటూరు ప్రవీణ్‌లను పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఆరుగురిని గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు వంటి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సమాజానికి హానికరమైన చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరు పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ఒక ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించనున్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు.


