విజయవాడ జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్సలు | - | Sakshi
Sakshi News home page

విజయవాడ జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్సలు

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రాహుల్‌(16) గత కొద్ది నెలలుగా శ్వాస ఆడకపోవడంతో పాటు ముక్కు నుంచి రక్తం కారడం ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్‌టీ ఓపీడీలో సంప్రదించగా.. ఈ నెల 13న అడ్మిట్‌ చేసి అన్ని రక్త పరీక్షలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ చేసి ముక్కు లోపలి జువైనెల్‌ నాసొఫాంజియల్‌ ఆంజియోఫైబ్రోమా పెరుగుతుందని నిర్ధారించారు. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కొణిదె రవి, మత్తు విభాగాధిపతి డాక్టర్‌ వినయ్‌ కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండల రావు సహకారంతో ముందుగా ఎంబోలైజేషన్‌ చేసి ఆ ట్యూమర్‌ని ఎండోస్కోప్‌ ద్వారా విజయవంతంగా తొలిగించారు. పేషెంట్‌ను ఈ నెల 22న డిశ్చార్జి చేశారు. ఇది మగ పిల్లలో కౌమారదశలో వస్తుందని హర్మోన్లు ప్రభావం వల్ల పెరుగుతుందని, అత్యంత ప్రమాదకరమని చేసి తెలిపారు, సర్జరీలో డాక్టర్‌ కె. రవి, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ స్పందన, డాక్టర్‌ విజయ కృష్ణ, డాక్టర్‌ ఆదర్శ్‌, డాక్టర్‌ వినయ్‌, డాక్టర్‌ పావని, డాక్టర్‌ వైదేహి పాల్గొన్నారు.

అలాగే నగరానికే చెందిన పి. రజని(33) గత కొద్ది నెలలుగా కుడివైపు ముక్కు నుంచి నీరు కారడం వల్ల ప్రభుత్వాసుపత్రి ఈఎన్‌టీ ఓపీడీకి వచ్చారు. ఆమెకి కపాలం అడుగు భాగం నుంచి నీరు వస్తోంది. వైద్యులు ఇది సీఎస్‌ఎఫ్‌రినోర్హియా అని నిర్ధారించారు. ఆమెకి సీటీ, ఎంఆర్‌ఐ చేయించి ఎండోస్కోపీ ద్వారా కపాలం అడుగు భాగం లీకుని అరికట్టడానికి ఈ నెల 16న వివిధ రకమైన అంటుకట్టులు (తొడ భాగం కండరాల పైనుండి తీసిన పొర, కొవ్వు, ఫైబ్రిన్‌ సీలెంట్‌) వాడి ఎంతో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తిచేసి 22న డిశ్చార్జి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement