మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వచ్చే నెలలో నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అత్యంత సమర్థంగా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు, ఎండీ ఎస్.భరణి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్స్ నిర్వహణ గురించి, క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడ మీలు, శాప్ లీగ్స్, క్రీడా యాప్ గురించి బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. రవి నాయుడు మాట్లాడుతూ వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను స్కూల్ గేమ్స్ విభాగం, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖల సమన్వయంతో నిర్వహించాలన్నారు. శాప్ ఎండీ భరణి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న శాప్ లీగ్స్‌ను జిల్లా యంత్రాంగం, స్థానిక క్రీడా సంఘాలు, విద్యాసంస్థలతో సమన్వయం చేసుకుని పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. అకాడ మీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిపుణులైన కోచ్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రీడా యాప్‌ను మరింత సమర్థంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. శాప్ కార్యాలయ ఏఓ వెంకట రమావత్ నాయక్, క్రీడా విభాగం అధికారులు పాల్గొన్నారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు,
ఎండీ భరణి


