నవరాగం పలికించే.. యువరాగం పులకించే | - | Sakshi
Sakshi News home page

నవరాగం పలికించే.. యువరాగం పులకించే

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

నవరాగం పలికించే.. యువరాగం పులకించే

విజయవాడ కల్చరల్‌: శ్రీ సద్గురు త్యాగరాజస్వామి 259వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంకీర్తనా గానం మధురంగా సాగింది. బుధవారం నాటి కార్యక్రమంలో త్యాగరాజస్వామి రచించి స్వరపరచిన కీర్తనలు శోభిల్లు సప్తస్వర, హెచ్చరిక కాగా రారా, మేలుకోదయానిధి, శోభనే, లాళియూగవే, శోభనే, శోభిల్లు సప్తస్వర, నీదయదా తదితర కీర్తనలకు గాయకులు గాన ప్రతిష్ట చేశారు. యుక్తశ్రీ కచేరీతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓరుగంటి షణ్ముఖ ప్రియ, మల్లాది ఆహ్లాద్‌, ఆముక్త్‌, నయన, కీర్తన, పొన్నపల్లి రమాభగవాన్‌, డాక్టర్‌ చింతలపాటి మంజుల, బుర్రా నీలకంఠశాస్త్రి, పోపూరి గాయత్రి గౌరీనాథ్‌, కొండా శశిధర్‌(వీణ), విష్ణుబొట్ల సోదరీమణులు కీర్తనా యజ్ఞంలో పాల్గొన్నారు. బీవీఎస్‌ ప్రసాద్‌, జగన్మోహిని, కె.అరవింద్‌ వాద్యసహకారం అందించారు. త్యాగరాజ స్వామి, సీతా సమేత శ్రీరామచంద్రునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రామభక్తి సామ్రాజ్యాన్ని చాటిన కీర్తనలు

కార్యక్రమాలను ప్రారంభించిన సద్గురు సంగీత సభ కార్యదర్శి గౌరీనాథ్‌ మాట్లాడుతూ త్యాగరాజ స్వామి సంకీర్తనలు రామభక్తి సామ్రాజ్యాన్ని చాటాయన్నారు. ఆయన రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సంస్థ నిర్వాహకులు బీవీఎస్‌ ప్రకాష్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement