లింగాల(వత్సవాయి): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని లింగాల గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. పెనుగంచిప్రోలుకు చెందిన పెనుగొండ తిరుపతిరావు (27) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం ద్విచక్ర వాహనంపై వత్సవాయి వెళ్తున్నాడు. లింగాల గ్రామ సెంటర్‌లోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ లారీ ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న మరో ఆర్‌టీసీ బస్సును బలంగా డీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో తిరుపతిరావు అక్కడిక్కడే దుర్మణం చెందాడు. మృతునికి భార్య కూతురు ఉన్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై ఎస్‌ఐ పి ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు.
లైంగిక దాడిపై పోక్సో కేసు నమోదు
ఉంగుటూరు(గన్నవరం): మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బుధవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఉంగుటూరుకు చెందిన చింతపల్లి కిరణ్‌బాబు టైల్స్ పని చేస్తుంటాడు. ఇటీవల అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినితో చనువుగా మెలుగుతున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గోవిందు తెలిపారు.


